కేసీఆర్ తెలంగాణ సాధన కోసం అన్ని వర్గాల ప్రజలను తనవైపుకు తిప్పుకున్న మాట వాస్తవమే. ఆయన తన మాటలతో ఆకట్టుకున్న వర్గాల్లో దళిత వర్గం కూడ ఒకటి. అసలు దళితుల కోసమే తెలంగాణ రాష్ట్రమన్న కేసీఆర్ తాను ముఖ్యమంత్రి అయితే దళితుడినే ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఎన్నికల్లో గెలిచాక తానే వెళ్లి సీఎం కుర్చీలో కూర్చున్నారు. మరి దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన మాటకు ఇప్పటికీ ఆయన వద్ద సమాదానం లేదు. రెండసారి కూడ ఆయన సీఎం అయ్యారు. ఈ మాట తప్పడంతోనే ఆయన మీద దళిత వ్యతిరేకి అనే ముద్ర వేసేశారు రాజకీయ ప్రత్యర్థులు. ఇప్పటికీ కేసీఆర్ మీద విమర్శలు చేయాల్సి వస్తే ఇదే అంశాన్ని లెవనెత్తుతారు కాంగ్రెస్ నాయకులు.
కేసీఆర్ మాట తప్పడంతోనే దళితుల్లో కొంత వ్యతిరేకత మొదలైంది. ఎమ్మార్పీఎస్ లాంటి సంఘాలు కేసీఆర్ మీద పోరాటం ప్రకటించాయి. దీనికి తోడు దళిత నేత టి.రాజయ్యను కేసీఆర్ మంత్రి వర్గం నుండి బర్త్ రఫ్ చేయడం దళితుల్లో మరింత ఆగ్రహాన్ని కలుగించింది. అలాగే ఒకరిద్దరు దళితులు హత్యకు గురికావడం, పలు చోట్ల అంబేద్కర్ విగ్రహాలు ధ్వంసం కావడంతో కేసీఆర్ కావాలనే దళితుల పట్ల వివక్ష చూపుతున్నారని విపక్షాలు దుమ్మెత్తిపోశాయి. వాటి నుండి బయటపడటం కోసం కేసీఆర్ దళితులకు మూడెకరాల భూమి, హైదరాబాద్ నగరంలో అంబేడ్కర్ భారీ విగ్రహం ఏర్పాటు లాంటి హామీలు ఇచ్చారు.
వాటిలో మూడెకరాల భూమి హామీ మరుగునపడిపోయింది కానీ విగ్రహం ఏర్పాటు హామీ లైమ్ లైట్లోనే ఉంది. నిత్యం దీనిపై ఎక్కడో ఒక చోట కేసీఆర్ సర్కార్ మీద విమర్శలు వెల్లువెత్తేవి. అందుకే ఆ హామీని నెరవేర్చడానికి కేసీఆర్ సర్కార్ నడుం బిగించింది. హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ దగ్గర్లో 11 ఎకరాల విస్తీరణంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు రంగం సిద్దం చేశారు. ఇందుకు సంబంధించిన విగ్రహ నమూనాను మంత్రి ఈటల రాజేందర్ ఆవిష్కరించారు. ఇందుకోసం రూ.140 కోట్లు కేటాయించారు. విగ్రహంతో పాటు అంబేద్ర్ లైబ్రరీ, మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు. ఈమేరకు ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. మరి ఈ చర్యతో అయినా కేసీఆర్ మీద పడిన దళిత వ్యతిరేకి అనే ముద్ర కొంచెమైనా తగ్గుతుందేమో చూడాలి.