కేసీయార్ ఢిల్లీ పర్యటన.! ఈసారి ఏమవుతుందబ్బా.?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పేస్తానంటూ చాలా ఏళ్ళుగా చెబుతూనే వున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీ సహా దేశంలో చాలా రాష్ట్రాలు తిరుగుతున్నారు, ఆయా రాష్ట్రాల్లోని అధికారంలో వున్న పార్టీల అధినేతలతో మంతనాలు జరుపుతున్నారు. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ యేతర ప్రభుత్వం రావాలన్నది కేసీయార్ ఆలోచన.

అయితే, కేసీయార్ మాటలెక్కువ.. చేతలెక్కువ.. అన్న విమర్శ ఈనాటిది కాదు. తన కుమారుడు కేటీయార్‌కి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కీలక బాధ్యతలు అప్పగించాక, ముఖ్యమంత్రి పదవి విషయంలోనూ కీలక నిర్ణయం కేసీయార్ తీసుకుంటారనే ప్రచారం జరిగింది. కానీ, అలా జరగలేదు.

వచ్చే ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. ఒకవేళ ముందస్తు ఎన్నికల వైపు కేసీయార్ మొగ్గు చూపితే, ఈ ఏడాదిలోనే జరగొచ్చు కూడా. జాతీయ రాజకీయాల్ని బేరీజు వేసుకుని, కేసీయార్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశముంది.

దేశంలో బీజేపీ, కాంగ్రెస్ యేతర రాజకీయ శక్తులతో మంతనాలు జరపడం, అదే విధంగా ఆర్థిక నిపుణులతో చర్చించడం.. ఇవీ కేసీయార్ ఢిల్లీ పర్యటన ఉద్దేశ్యాలు. అయితే, కేసీయార్ అటు కాంగ్రెస్ పార్టీతోనూ, ఇటు తెలంగాణ రాష్ట్ర సమితితోనూ టచ్‌లో వున్నారనీ, తెరవెనుక స్నేహం చేస్తున్నారనీ రాజకీయ ప్రత్యర్థుల నుంచి విమర్శలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఏమో, కేసీయార్ రాజకీయ వ్యూహాలెలా వుంటాయోగానీ.. ‘జాతీయ స్థాయిలో చక్రం’ తిప్పడం అనేది కేవలం మాటలకే పరిమితమవుతుండడం పట్ల గులాబీ శ్రేణులు ఒకింత ఆవేదన చెందుతున్నమాట వాస్తవం.