తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా విజయం సాధించిన తెరాస ఈసారి మాత్రం భయపడుతోంది. గులాబీ బాస్ కేసీఆర్ అయితే తెగ కంగారు పడిపోతున్నారట. అవే ఎమ్మెల్సీ ఎన్నికలు. త్వరలో తెలంగాణలోని రెండు స్థానాలకు పట్టభద్రుల ఎన్నికలు జరగనున్నాయి. వరంగల్-నల్గొండ-ఖమ్మం జిల్లాల పట్టభద్ర నియోజకవర్గ టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్ర నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పదవీ కాలం 2021 మార్చితో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో ఓటర్ల నమోదు షెడ్యూలును ప్రకటించనుంది. వీటిలో వరంగల్-నల్గొండ-ఖమ్మం స్థానంలో జరగబోయే పోటీ రసవత్తరంగా సాగనుంది.
ఎందుకంటే ఈ స్థానం నుండి టీజేఎస్ తరపున ప్రొఫెసర్ కోదండరాం బరిలోకి దిగుతున్నారు. కోదండరాంకు కేసీఆర్‌కు అస్సలు పడదు. తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసిన వీరు రాష్ట్రం ఏర్పడ్డాక విడిపోయారు. అప్పటివరకు కోదండరాంను ఆకాశానికెత్తిన కేసీఆర్ విడిపోయాక అసలు కోదండరాం ఎందుకూ పనికిరారన్నట్టు మాట్లాడారు. ఏ ఎన్నికల్లో నిలబడినా గెలవలేరని ఎద్దేవా చేశారు. దీంతో కోదండరాంలో పట్టుదల పెరిగింది. ఇన్నాళ్లు అవకాశం కోసం ఎదురుచూసిన ఆయన ఈ పట్టభద్రుల ఎన్నికల్లో గెలిచి పెద్దల సభలో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈమేరకు తనకు మద్దతివ్వాలని మిగతా ప్రతిపక్షాలను కోరారు.
అసెంబ్లీ ఎన్నికలై ఉంటే కేసీఆర్ అంతలా కంగారుపడేవారు కాదు. కానీ ఇవి ఎమ్మెల్సీ ఎన్నికలు. ఓటర్లు అందరూ పట్టభద్రులే ఉంటారు. పట్టభద్రుల్లో సాధారణంగానే ప్రభుత్వం అంటే కాస్త వ్యతిరేకత ఉంటుంది. పైగా నిరుద్యోగం లాంటి సమస్యలు, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో కోదండరాం మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ఉండటంతో పోటీ నువ్వా నేనా అనేలా ఉండనుంది. అందుకే కేసీఆర్ అతిజాగ్రత్త వహిస్తున్నారు. ఉన్న అన్ని శక్తులను కూడదీసుకుంటున్నారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ మూడు జిల్లాల ఎమ్మెల్యేలు, ఎంపీలను అలర్ట్ చేశారట. కేటీఆర్ అయితే ఓటర్ల నమోదు కార్యక్రమం పక్కగా జరగాలని, ఎక్కువ మంది నమోదు అయ్యేలా చూడాలని స్థానిక నేతలకు చెబుతున్నారు. మొత్తాని తండ్రీకొడుకులు ఇద్దరూ కోదండరాంను ఓడించాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నారు.