తెలంగాణ ఉద్యమం నుండి తండ్రి కేసీఆర్ వెంటే ఉంటూ వఛ్చిన కవిత అనతి కాలంలోనే క్రియాశీలక రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తెరాస నాయకురాలిగా రాష్ట్ర ప్రజలకు మాత్రమే తెలిసిన ఆమె తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా మాత్రం అనేక దేశాల్లోని తెలుగు ప్రజలకు సుపరిచితురాలు. తెలంగాణ సంస్కృతిని, బతుకమ్మ పండుగ గొప్పదనాన్ని దేశవిదేశాలకు ప్రచారం చేసిన ఘనత ఆమెదే. ఈనాడు విదేశాల్లోని తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పండుగను అంత గొప్పగా జరుపుకోగలుగుతున్నారు అంటే వెనుక కవిత ప్రోత్సాహం చాలానే ఉంది.
కేవలం రాజకీయాల్లోనే కాదు సామాజిక మాధ్యమాల్లో కూడా కవిత చాలా యాక్టివ్. నిత్యం ప్రజా సమస్యల మీద, ప్రభుత్వ విధానాల గురించి ట్విట్టర్లో స్పందిస్తూ ఉంటారామె. కార్యకర్తలకు, తెలంగాణ జాగృతి సంఘం అభిమానులకు నిత్యం టచ్లోనే ఉంటారు. అందుకే ఆమెకు ట్విట్టర్లో 1 మిలియన్ అనగా 10 లక్షల మంది ఫాలోవర్లు యాడ్ అయ్యారు. ఇలా ట్విట్టర్లో మిలియన్ ఫాలోవర్లను సంపాదించుకున్న ఏకైక దక్షిణాది మహిళా నేతగా గుర్తింపు పొందారు కవిత.
తండ్రి వెంటే రాజకీయాల్లోకి అడుగులు వేసిన ఆమె తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ఐడెంటిటీని తెచ్చుకుని 2014 ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుండి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో ఆమె లక్ష 60 వేల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు. ఒకానొక దశలో సోదరుడు కేటీఆర్ కంటే ఆమే వేగంగా ఎదుగురుతూ కనిపించారు. కానీ 2019 ఎన్నికల్లో నిజామాబాద్ నుండి ఎంపీగా ఓడిపోవడంతో ఆమె కొద్దిగా నెమ్మదించినట్టు కనిపించినా ఈమధ్య పుంజుకుని మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యే పనిలో ఉన్నారు.