ఏపీ సీఎం వైఎస్ జగన్ పై కోర్టు ధిక్కరణ కేసులు నమోదైన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు జడ్జిల తీర్పులపై ఆయన ఆరోపణలు చేస్తూ ఏకంగా సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు జగన్. దానిపై అప్పట్లో పెద్ద రచ్చ జరిగింది. ఆ లేఖలో ఏముంది? జగన్ ఇలాంటి పని చేయడం.. కోర్టు దిక్కరణ కిందికే వస్తుందంటూ.. దాన్ని సవాల్ చేస్తూ… సుప్రీంలో పిటిషన్లు దాఖలు అయ్యాయి.
ఈ పిటిషన్లపై సుప్రీంలోని ఓ ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే.. ఆ ధర్మాసనంలో సభ్యుడిగా ఉన్న జస్టిస్ యూవీ లలిత్.. ఆ విచారణ నుంచి తప్పుకున్నారు. దీనిపై విచారణను మరో ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్టు లలిత్ వ్యాఖ్యానించారు.
సీఎం జగన్ కోర్టు ధిక్కరణ కేసుపై జీఎస్ మణి, ప్రదీప కుమార్, ఎస్కే సింగ్ అనే లాయర్లు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా… సుప్రీం సీనియర్ జడ్జి జస్టిస్ ఎన్వీ రమణపై ఎలా పబ్లిక్ గా ఆరోపణలు చేస్తారంటూ వాళ్లు తమ పిటిషన్ లో ప్రస్తావించారు.
ఆయనకు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదని… ఆయన్ను వెంటనే ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి… ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ తమ పిటిషన్ లో పేర్కొన్నారు.
అయితే.. ఈ విచారణ చేపట్టిన ధర్మాసనం నుంచి జస్టిస్ లలిత్ తప్పుకొని దాన్ని వేరే ధర్మాసనానికి చీఫ్ జస్టిస్ బదిలీ చేస్తారని… ఇప్పటికే వాదులు, ప్రతివాదుల్లో ఒకరి తరుపున వాదించడం వల్ల ఆ విచారణను తాను చేపట్టడం లేదని లలిత్ వెల్లడించారు. దీంతో ఈ కేసు ఇంకాస్త ఆసక్తిగా మారింది.