వెళ్ళిపోయేవాళ్ళని జనసేనాని ముందే పంపించేస్తే బెటర్.!

Janasenani Pawan To Take Serious Action On Them

Janasenani Pawan To Take Serious Action On Them

రాజకీయాల్లో నేతలు పార్టీలు మార్చేయడాన్ని కప్పల తక్కెడ వ్యవహారంగా అభివర్ణిస్తుంటారు ప్రజాస్వామ్యవాదులు. ఎక్కడ అధికారం వుంటే, అక్కడికి పారిపోతుంటాయి కొన్ని పొలిటికల్ కప్పలు. ఇది కొత్త విషయమేమీ కాదు. అయితే, గతానికి భిన్నంగా ఇప్పుడు గెంతుడు వ్యవహారాలు అత్యంత వేగంగా, అత్యంత జుగుప్సాకరంగా సాగుతున్నాయంతే. పొద్దున్న ఓ పార్టీ, మధ్యాహ్నం మరో పార్టీ, సాయంత్రానికి ఇంకో పార్టీ.. ఇదీ ఇప్పటి రాజకీయాల తంతు. ఎన్నికలొచ్చాయంటే చాలు, తమ నాయకుడు ఏ క్షణాన ఏ పార్టీలో వుంటాడో తెలియక అనుచరులు తెగ బాధపడిపోతుంటారు. సిద్ధాంతాల గురించి ఇప్పటి రాజకీయాల్లో మాట్లాడుకోవడమే అనవసరం. అధికారం.. అంతిమంగా అధికారమే పరమావధి.

ఎంత ఖర్చు చేశాం.? ఎంత సంపాదించాం.? అన్నదే లెక్క. పేరు ప్రఖ్యాతులెవడికీ అక్కర్లేదిక్కడ. మిగతా పార్టీలకు తాము చాలా భిన్నం.. అని చెబుతోంది జనసేన పార్టీ. చెప్పాల్సిందే.. తప్పదు. ఎందుకంటే, ఇంకా అధికారంలోకి రాలేదు గనుక. ఒకవేళ అధికారంలోకి వస్తే, ఆ మాట అనడానికి జనసేన పార్టీకి ఆస్కారమే వుండదు. అన్నట్టు, ఇప్పటికే జనసేన మీద ప్యాకేజీ పార్టీ అనే ముద్ర వుంది. ప్రత్యర్థి పార్టీలు బట్ట కాల్చి మొహాన వేస్తోంటే, ఆ మసి తుడుచుకోలేకపోతోంది జనసేన. సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ, మాదాసు గంగాధరం.. ఇలా కొందరు నేతలు, జనసేనను వీడే క్రమంలో చేసిన ఆరోపణలు జనసేనను పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోయాయి. అంతకు ముందు రాజు రవితేజ కూడా జనసేన మీద బురద చల్లే ప్రయత్నం చేశారు. అన్నయ్య చిరంజీవికే తప్పలేదు, తనకు తప్పుతుందా.? అని పవన్ అనుకుని వుండొచ్చుగాక. కానీ, జనసేన గతంలోలా లేదు. 2024 ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటోంది.

సత్తా చాటడం సంగతి దేవుడెరుగు, అప్పటివరకూ ఓ రాజకీయ పార్టీగా మిగలాలంటే, పార్టీ నుంచి ఎవరెవరైతే ముందు ముందు గోడ దూకెయ్యబోతారో.. అలాంటివారిని ముందే గుర్తించి బయటకు పంపించే బాధ్యతను జనసేన అధినేత తీసుకోవాలి. కానీ, అది సాధ్యమేనా.? ఎవరి మనసు ఎప్పుడెలా మారిపోతుందో ఎవరు చెప్పగలరు.?