నిరుద్యోగ యువతకు బాసటగా జాబ్ క్యాలెండర్‌ పై జనసేనాని పోరాటం

Janasena will fight over job calendar for unemployed youth

జాబ్ క్యాలెండర్‌ పేరుతొ మోసపోయిన నిరుద్యోగ యువతకు బాసటగా జనసేన పోరాటం చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జగన్ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌ పెద్ద ఎత్తున వివాదాంశమైంది. రాష్ట్రంలో వేల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నా కేవలం కొన్నింటిని మాత్రమే జాబ్ క్యాలెండర్‌ లో చూపించారంటూ నిరుద్యోగ యువత నిరసనల బాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో విద్యార్థి, యువజన సంఘాల నేతలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం పవన్ ను కలిసిన ఉద్యోగ సంఘాల నేతలు తమకు జరిగిన అన్యాయాన్ని వివరించటం జరిగింది. ఈ అంశం మీద తాజాగా పవన్ తన కార్యాచరణను ప్రకటించారు.

Janasena will fight over job calendar for unemployed youth

“లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో వైసీపీ చెప్పిన మాటలను నమ్మిన నిరుద్యోగ యువత తాజాగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌ లోని ఖాళీలను చూసి మోసపోయిందని ఆయన అన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను జాబ్‌ క్యాలెండర్‌లో చేర్చాలని డిమాండ్‌ చేసిన జనసేనాని… లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తామని వైసీపీ హామీ ఇచ్చిందని… సుమారు 30 లక్షల మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. పోటీ పరీక్షల కోసం యువత ఎన్నో కష్టాలను ఓర్చుకుని సిద్ధమవుతున్నారని వివరించారు.

ఏపీపీఎస్సీ ద్వారా 2.3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి చివరకు జాబ్‌ క్యాలెండర్‌లో కేవలం 10 వేల ఉద్యోగాలను మాత్రమే చూపడం కచ్చితంగా యువతను వంచించటమే అని పేర్కొన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2 విభాగాల్లో కేవలం 36 ఖాళీలు మాత్రమే చూపాడమంటే మోసమేననన్నారు. ఈ నెల 20న అన్ని జిల్లాలోని జనసేన నాయకులు, శ్రేణులు నిరుద్యోగ యువతను కలుపుకుని జిల్లా ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ లకు వెళ్లి నిరుద్యోగుల తరుఫున అధికారులకు వినతి పత్రాలను అందజేయాలని నిర్ణయించినట్టు చెప్పారు.

సీఎం చెప్పిన మెగా డీఎస్సి ఏమైందని పవన్ ప్రశ్నించారు. పరీక్షల ఫీజుల రూపంలో ప్రభుత్వానికి కొన్ని కోట్లు ఆదాయం వస్తుందని, ఆ విధంగా యువత ఆశలను ప్రభుత్వం సొమ్ము చేసుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగంలోనే కాదు రాష్ట్రంలో ప్రవైటు రంగంలోనూ ఉద్యోగ కల్పన జరగడంలేదని… రాష్ట్రంలో కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలు వచ్చే వాతావరణం లేదని ఆయన మండిపడ్డారు. ఉద్యోగాల మీద ఆశ పెట్టుకున్న యువతకు అడియాశలే మిగిలాయని, వారికి అండగా జనసేన పార్టీ ఉంటుందని” పవన్ భరోసా ఇచ్చారు.