జనసేన ట్రిపుల్ యాక్షన్ షురూ చేస్తోందా.?

ఇటు రాయలసీమ, అటు ఉత్తరాంధ్ర.. ఇంకోపక్క ఉభయ గోదావరి జిల్లాలు.. ఇలా ట్రిపుల్ యాక్షన్ ప్లాన్ దిశగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా వ్యూహాలకు పదును పెడుతున్నారట. గతంలో తాను రాయలసీమ నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు ప్రకటించినా.. అందుకు సాహసించలేకపోయారాయన.

2019 ఎన్నికల్లో భీమవరం అలాగే గాజువాక నియోజకవర్గాల నుంచి జనసేన అధినేత పోటీ చేసినా, రెండు చోట్లా ఓడిపోయారు. అంతకు ముందు ప్రజారాజ్యం పార్టీ విషయానికొస్తే, చిరంజీవి పాలకొల్లులో ఓడి తిరుపతిలో గెలిచిన విషయం విదితమే.

అన్ని సమీకరణాల్ని పరిగణనలోకి తీసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఈసారి తిరుపతి అలాగే ఉభయ గోదావరి జిల్లాలు, వీటితోపాటుగా ఉత్తరాంధ్రపై స్పెషల్ ఫోకస్ పెట్టారట. విశాఖ జిల్లా గాజువాక నుంచి ఇంకోసారి జనసేన అధినేత పోటీ చేసే అవకాశం లేదంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసే అవకాశం వుందట.

తిరుపతి నుంచి బలమైన అభ్యర్థిని పవన్ నిలబెట్టబోతున్నారట. ఆ బలమైన అభ్యర్థి కొణిదెల కుటుంబ సభ్యుడే అవుతాడని సమాచారం. చిరంజీవిని రాజకీయాల్లోకి మళ్ళీ లాగాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జనసేన మిత్రపక్షం బీజేపీ, చిరంజీవితో మంతనాలకు సిద్ధమవుతోంది.

జనసేన నుంచి కాకుండా బీజేపీ తరఫున చిరంజీవిని నిలబెట్టాలని ప్లాన్ చేస్తున్నారట. ఒకవేళ లోక్ సభ వైపు చిరంజీవి ఆలోచన చేస్తే మాత్రం, విశాఖ లేదా ఉభయ గోదావరి జిల్లాల్లో ఆ అవకాశం వుండొచ్చని సమాచారం. అయితే, చిరంజీవి అంత ఆసక్తి చూపడంలేదట పొలిటికల్ రీ-ఎంట్రీ విషయంలో.

మొత్తమ్మీద, మూడు ప్రాంతాల్ని టార్గెట్ చేయడం ద్వారా, ఆ ప్రభావంతో చెప్పుకోదగ్గ సీట్లు గెల్చుకోగలమన్నది జనసేన వ్యూహకంగా కనిపిస్తోంది. వ్యూహాలు సరే, ఓట్లు పడతాయా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.