Janasena : జనసేన ప్లకార్డుల పోరు.. అట్టర్ ఫ్లాప్ షో.?

Janasena : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్లకార్డుల ఉద్యమం చేపట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ఎంపీలు, విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలన్నది జనసేన అధినేత పిలుపునిచ్చిన ప్లకార్డుల ఉద్యమం తాలూకు ఉద్దేశ్యం. ఈ క్రమంలో జనసైనికులు, అధికార వైసీపీనే టార్గెట్ చేశారు. కానీ, అధికార వైసీపీ ఈ మొత్తం వ్యవహారాన్ని లైట్ తీసుకుంది.

జనసైనికులు మాత్రం ఉత్సాహంగా సోషల్ మీడియా వేదికగా, ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అంటున్నారు. సేవ్ విశాఖ స్టీల్ ప్లాంట్ అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ చేస్తున్నారు. ఇంకేదేదో హడావిడి చేస్తున్నారు. ఇంతకీ, జనసేన హంగామా ఎంతవరకు ఆ పార్టీకి రాజకీయంగా కలిసొచ్చేలా చేస్తోంది.? ఈ ఉద్యమంలో ఊపు ఏమైనా వచ్చిందా లేదా.?

ఈ వ్యవహారంపై రాజకీయ విశ్లేషకుల వాదన వింటే, జనసేన సాధించింది ఏమీ లేదనే విషయం స్పష్టమవుతోంది. సోషల్ మీడియా వేదికగా ప్లకార్డుల ఉద్యమం చేపడితే ఏమన్నా ఉపయోగం వుంటుందా.? జనసేనాని స్వయంగా రోడ్డెక్కి ఆందోళనలు చేస్తే ఫలితం వుంటుందేమో.

మొన్నీమధ్యనే, గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత ఒక రోజు దీక్ష చేశారు. కాదు కాదు, ఒక పూట దీక్ష చేశారు.. విశాఖ స్టీలు ప్లాంటు విషయమై. ఆ దీక్ష కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. నిజానికి, ఆయన దీక్ష చేయాల్సింది విశాఖపట్నంలో. కానీ, ఎక్కడ కేంద్ర ప్రభుత్వ పెద్దలకు కోపం వస్తుందోనని జనసేనాని, చాలా తెలివిగా ప్లాన్ చేసుకున్నారు పార్టీ కార్యాలయంలో దీక్ష కోసం.

ఇదిలా వుంటే, విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కేంద్రం తాజాగా పార్లమెంటులో స్పష్టం చేసేసింది. ప్రైవేటీకరణతో ప్లాంటు విస్తరణ అవకాశాలు మెరుగవుతాయని చెబుతోంది కేంద్రం. మరి, పవన్ ఇప్పుడేమంటారు.? వైసీపీ మీద చేస్తున్న పోరాటం, బీజేపీ మీద జనసేనాని చేస్తే కాస్తో కూస్తో ఉపయోగం వుంటుందేమో.