అమరావతి:రాజధాని క్రెడిట్ చంద్రబాబుకు ఇవ్వకుండా తానే తీసుకోవాలనే తపనతో వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు నిర్మాణానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ మూడు రాజధానులు నిర్మాణం కోసం జగన్ అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాడు. అమరావతిలో రైతులు పోరాడుతున్నా, ప్రాణాలు కోల్పోతున్నా, టీడీపీ నాయకులు రకరకాల సవాళ్లు చేస్తున్నా పట్టించుకోకుండా తన లక్ష్యం వైపు పరుగులు తీస్తున్నారు. వచ్చిన అడ్డంకులను తొలగించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
మూడు రాజధానులు ఏర్పాటుకు సంబంధించిన వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను గవర్నర్ చేత కూడా ఆమోద ముద్ర వేయించుకున్నాడు. అయితే ఈ బిల్లును వ్యతిరేకిస్తూ అమరావతిలో చంద్రబాబు హయాంలో 33 వేల ఎకరాల భూమి ఇచ్చిన హై కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు ప్రభుత్వానికి కౌంటర్ పిటిషన్ దాఖలు చేయడానికి సమయమిస్తూ ప్రస్తుతానికి ఈ బిల్లులపై స్టేటస్ కో విధించింది. అయితే ఎలాగైనా ఈనెల 16న రాజధానికి శంకుస్థాపన వేయాలని నిర్ణయించుకున్న జగన్ హై కోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లారు.
ఈ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. అయితే ఇప్పటివరకు హై కోర్టు తీర్పులపై సుప్రీం కోర్టు వెళ్లిన ప్రతిసారి జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బె తగిలింది. ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ విషయంలో రెండుసార్లు సుప్రీంకు వెళ్లిన ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. అయితే ఈసారి కూడా అలానే ప్రభుత్వం పరువు పోతుందన్న భయంతో ఎలాగైనా గెలవాలని ప్రభుత్వ న్యాయవాదులకు హెచ్చరికలు జారీ చేశారు.
అయితే జగన్ ప్రభుత్వానికి ఈసారి కూడా ఓటమి తప్పదని న్యాయవిశ్లేషకులు చెప్తున్నారు. హై కోర్టు బిల్లుపై స్టేటస్ కో ఇచ్చిందే కానీ స్టే ఇవ్వలేదని, దీనిపై ప్రభుత్వం వాదిన సుప్రీంలో చెల్లదని న్యాయ పండితులు చెప్తున్నారు. రాజధాని శంకుస్థాపనకు ప్రధాని మోదీని పిలవాలని, ఈ మూడు రాజధానులు ఏర్పాటు ఆయనకు నచ్చిందని ప్రజలకు తన మాటల ద్వార కాకుండా చేతల ద్వారా చెప్పడానికి జగన్ వేసిన మాస్టర్ ప్లాన్ ఈసారి కూడా కుదేలయ్యేలా ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.