తెలుగు సినిమా లెక్కలు తేలే సమయమొచ్చిందా.?

సినిమా డిజాస్టర్ అయినా, దాన్ని సూపర్ హిట్ అని చెప్పుకోవడానికే సినీ జనాలు ఇష్టపడతారు. సినిమా అంటేనే అంత. అదొక గ్లామర్ ప్రపంచం. చాలా అరుదుగా మాత్రమే తమ సినిమాల్ని ఫ్లాప్ అని దర్శక నిర్మాతలు కావొచ్చు, నటీనటులు కావొచ్చు.. చెప్పుకుంటుంటారు. ఇప్పుడిదంతా ఎందుకంటే, వైఎస్ జగన్ ప్రభుత్వం.. సినిమా లెక్కల్ని తేల్చేయాలనుకుంటోంది గనుక. ఆయా సినిమా పేర్లను మంత్రి పేర్ని నాని నేరుగా ప్రస్తావించకపోయినా, సంక్రాంతికి వచ్చిన రెండు పెద్ద సినిమాలకు సంబంధించిన వసూళ్ళ వివరాల్ని వెల్లడించారు. 170 కోట్ల దాకా ఆ రెండు సినిమాలూ వసూలు చేసినట్లు బాక్సాఫీస్ లెక్కలు (ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి) వున్నాయనీ, మరి.. దానికి తగ్గట్టుగా రావాల్సిన పన్నులెందుకు రాలేదని పేర్ని నాని ప్రశ్నించారు. ఈ లెక్కలు తేల్చడానికే, ఆన్ లైన్ టిక్కెటింగ్ వ్యవస్థని ప్రభుత్వం తన కనుసన్నల్లో నడిపించాలనుకుంటోందని మంత్రి అభిప్రాయపడ్డారు.

నిజానికి, సినిమాల వసూళ్ళ విషయంలో నిర్మాతలు అధికారిక లెక్కలు విడుదల చేయరు. సినిమా ప్రమోషన్ కోసం పోస్టర్ల మీద అన్ని కోట్లు.. ఇన్ని కోట్లు.. అని చెప్పుకోవడం మామూలే. ‘బాహుబలి’ సినిమా విషయంలో జరిగిన ప్రచారం గురించి అందరికీ తెలిసిందే. ఆ సినిమా సంచలన విజయాన్నే అందుకుంది. కానీ, ప్రచారం జరిగిన రీతిలో.. అంటే వందల కోట్లు.. ఆ సినిమాకి లాభాలొచ్చేశాయని అనగలమా.? ‘అల వైకుంఠపురములో’, ‘సర్కారు వారి పాట’ సినిమాల పరిస్థితి అయినా అంతే. సినిమాల ప్రచారం కోసం వేసుకునే లెక్కలు, పరిశ్రమ కొంప ముంచేలా వున్నాయిప్పుడు. అయితే, ప్రభుత్వం ఇంకా ఆన్‌లైన్ టిక్కెట్ల వ్యవహారాన్ని (ప్రభుత్వమే నిర్వహించే అంశం) పరిశీలిస్తున్నట్లు మంత్రి చెప్పారు. తుది నిర్ణయం ఇంకా తీసుకోవాల్సి వుందట. అదొక్కటీ కాస్త ఊరట.. అనుకోవాలా.? ఏమో మరి, కాలమే సమాధానం చెప్పాలి ఈ ప్రశ్నకి.