ఇది క్లియర్: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి తిరుగులేదంతే.!

అది లోక్ సభ ఉప ఎన్నిక అయినా, అసెంబ్లీ ఉప ఎన్నిక అయినా.. స్థానిక ఎన్నికలైనా.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని ఇంకోసారి నిరూపితమయ్యింది. వైసీపీని ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో బలమైన విపక్షం కూడా లేదని స్పష్టమైపోయింది.

తాజాగా వెల్లడవుతున్న స్థానిక ఎన్నికల విషయానికొస్తే, దాదాపు అన్న చోట్లా వైసీపీ బలం స్పష్టంగా కనిపిస్తోంది. ఫ్యాను గాలి దెబ్బకి విపక్షాలు గల్లంతవుతున్నాయి. దర్శిలో మాత్రం టీడీపీ తన ఉనికిని చాటుకుంది. ఒకటి రెండు చోట్ల జనసేన పార్టీ అభ్యర్థులు గెలుపొందినా.. పెద్దగా ఆ పార్టీ ప్రభావమేమీ చూపలేదన్నది నిర్వివాదాంశం.

కుప్పంపై స్పెషల్ ఫోకస్ పెట్టిన వైసీపీకి, అక్కడి ఓటర్లు బ్రహ్మరథం పట్టినట్లే కనిపిస్తోంది. మిగతా చోట్ల కూడా వైసీపీకి ఎదురే లేకుండా పోతోంది. ‘స్థానిక ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి.. నైతిక విజయం మాదే..’ అని టీడీపీ చెప్పడంతోనే, స్థానిక ఎన్నికల్లో వైసీపీ విజయం ఖరారైపోయింది.

పెట్రో ధరల వ్యవహారం.. ఇతరత్రా అంశాలేవీ స్థానిక ఎన్నికల్లో ఓటర్లపై పెద్దగా ప్రభావం చూపలేదు. నిజానికి, స్థానిక ఎన్నికలంటేనే అధికార పార్టీకి అడ్వాంటేజ్ వుంటుంది. దానికి తోడు, వైసీపీ గత కొంతకాలంగా అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజల్లోనూ ప్రభుత్వ పాలన పట్ల పూర్తి విశ్వాసం వుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

ఆయా ఎన్నికల ఫలితాలతోనూ ఇదే విషయం సుస్పష్టమవుతోంది. అయితే, చాపకింద నీరులా జనసేన ఎదుగుతున్న వైనం పట్ల వైసీపీ రాజకీయంగా కాస్తంత అప్రమత్తంగా వుండాల్సిందే. అదే సమయంలో, టీడీపీ చేతులెత్తేస్తున్న దరిమిలా.. ప్రధాన ప్రతిపక్షం అనే స్థానాన్ని భర్తీ చేసేందుకు జనసేన పార్టీ మరింత బలంగా ముందడుగు వేయాల్సి వుంటుంది.