వైఎస్ జగన్‌తో కిషన్ రెడ్డి భేటీ.. అసలు కారణమేంటబ్బా.?

‘మా భేటీ వెనుక రాజకీయం ఏమీ లేదు..’ అని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చినా, బీజేపీ సీనియర్ నేతతో వైసీపీ అధినేత భేటీ అంటే, దాని చుట్టూ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ ఎందుకు జరగకుండా వుంటుంది.? జన ఆశీర్వాద యాత్ర పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజుల పాటు పర్యటించిన కిషన్ రెడ్డి, ఈ పర్యటనలో వైఎస్ జగన్ సర్కారుపై విమర్శలు చేశారు. దాంతో, బీజేపీ శ్రేణులు ఉప్పొంగిపోయాయి. కానీ, రెండో రోజు సాయంత్రానికి సీన్ మారిపోయింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కిషన్ రెడ్డి కలిశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కేంద్ర మంత్రి కలవడంలో మామూలుగా అయితే రాజకీయం ఏమీ వుండదు. కానీ, కిషన్ రెడ్డి చేపట్టింది రాజకీయ యాత్ర. ఆయనకు ప్రోటోకాల్ ప్రకారం ఏపీ ప్రభుత్వం మర్యాదలు చేయడం అనేది వేరే చర్చ.

కానీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద అప్పటిదాకా విమర్శలు చేసి, అనూహ్యంగా ఆయనతో భేటీ అవడమేంటి.? ఈ అంశంపై అందరికన్నా ఎక్కువగా బీజేపీ నేతలే తెగ బాధపడిపోతున్నారు. మరోపక్క బీజేపీ – వైసీపీ మధ్య తెరవెనుకాల స్నేహానికి ఇంతకన్నా సాక్ష్యం ఇంకేం కావాలంటూ టీడీపీ తెగ గుస్సా అయిపోతోంది. సోషల్ మీడియా వేదికగా ఈ వ్యవహారంపై బీభత్సమైన ట్రోలింగ్ జరుగుతోంది కూడా. ఇదిలా వుంటే, కిషన్ రెడ్డికి ఈ రోజు చిన్నపాటి ప్రమాదం చోటు చేసుకుంది. కారు ఎక్కుతుండగా, డోర్ పై భాగం తలకు తగలడంతో చిన్న గాయమైంది కిషన్ రెడ్డికి. ప్రాథమిక చికిత్స చేసిన సహాయ సిబ్బంది, పెద్ద ప్రమాదమేమీ లేదని తేల్చారు. ఇంతకీ కిషన్ రెడ్డి ఆశీర్వాద యాత్రలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ కూడా ముందే ఫిక్సయిపోయిందా.? అన్న ప్రశ్నకు సమాధానమెవరిస్తారబ్బా.? ఏమాటకామాటే చెప్పుకోవాలి.. రాజకీయంగా వైసీపీ – బీజేపీ మధ్య ఎన్ని బేధాభిప్రాయాలున్నా, ముఖ్యమంత్రి – కేంద్ర మంత్రి సమావేశంలో మాత్రం మనఃపూర్వకమైన ఆనందం కనిపించింది.. ఇరువురిలోనూ.