గత వారం రోజులు నుండి హైదరాబాద్ లో భారీ వర్షాలు పడటంతో నగరం జనాభా మొత్తం నరకయాతన అనుభవిస్తుంది. ఇప్పటికి కూడా అనేక లోతట్టు ప్రాంతాలు వరద ముంపులోనే వున్నాయి. అక్కడి జనాభా కనీసం బయటకు వచ్చి నిత్యావసర సరుకులు తీసుకోలేని పరిస్థితి, ఇంటిలో వంట చేసుకోలేని పరిస్థితి. మూడు నాలుగు రోజులు బిక్కుబిక్కుమంటూ వరద నీటిలోనే చిక్కుకొని, ఎవరైనా వాలంటీర్లు వచ్చి ఏమైనా తినటానికి ఇస్తారేమో అని ఎదురుచూస్తున్నా దుస్థితిలో ఉన్నారు.
మన తండ్రులు, తాతలు గతంలో చెప్పేవాళ్ళు. మా చిన్నప్పుడు వరదలు, తుఫాన్లు వస్తే వారం పదిరోజులు అల్లాడిపోయేవాళ్ళం, తినటానికి ఏమి ఉండేది కాదు, కట్టుబట్టలతోనే పసిబిడ్డలను కాపాడుకునేవాళ్లమని, అప్పటిలో అంటే సరైన వ్యవస్థ, పరిపాలన లేక అలాంటి ఇబ్బందులు పడ్డారంటే ఒక లెక్క, కానీ 2020 లాంటి ఆధునిక యుగంలో, అంతర్జాతీయ స్థాయి నగరంగా మారుతున్నా హైదరాబాద్ నడిబొడ్డున్న కూడా 1950,60 నాటి పరిస్థితులు వచ్చాయంటే దానికి కారణం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఘోరంగా విఫలమవ్వటమే అని చెప్పాలి.
దీన్ని కప్పిపుచ్చటానికి మా తప్పేమి లేదు, గత పాలకుల నిర్లక్ష్యం తోనే ఇలా జరిగిందని చెప్పుతుంది ప్రభుత్వం. కేసీఆర్ ప్రభుత్వం వచ్చి ఏడాది రెండేళ్లు కాదు దాదాపు ఆరేళ్ళు అవుతుంది. తెలంగాణ రాష్ట్రము మొత్తం మీద జరిగిన అభివృద్ధికి మేమే కారణమని చెప్పుకుంటున్న తెరాస నేతలు, ఇప్పుడు మాత్రం తప్పు గత పాలకులదే అంటూ వాళ్ళ మీదకి నెట్టటం ఎంత వరకు సమంజసం ..ఇదే విషయాన్నీ గట్టిగా ప్రశ్నించి, ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టి దైర్యం ఎవరికీ లేదు… ఇలాంటి సమయంలో ప్రజలకు అండగా నిలబడి, ప్రభుత్వాన్ని ఎదిరించే పని చేయాల్సిన మీడియా మన్ను తిన్న పాములా ఉండిపోయింది.
ఇప్పటికి అనేక మీడియా సంస్థలు హైదరాబాద్ సాధారణ స్థితికి వచ్చిందని, ఒకటి అరా తప్పితే అన్ని చోట్ల బాగానే ఉందని చెప్పటం విడ్డురం.. అంత బాగుంటే పాతబస్తీలో తెరాస మంత్రిని ఎందుకు అడ్డుకున్నారు , ఉప్పల్ లో ఎమ్మెల్యేను ఒక సాధారణ గృహణి ఎందుకు నిలదీసినట్లు, హయత్ నగర్ లో కడుపుకాలిన ఒక ఆడబిడ్డ కార్పొరేటర్ కాలర్ ఎందుకు పట్టుకున్నట్లు… ఇవేమి మీడియా వాళ్ళకి కనిపించటం లేదా..? లేక కనిపించిన కనపడలేదని కళ్ళు మూసుకున్నారా..? ఈ సంఘటనలు ఎవరో ఒకరు వీడియో లు తీసి సోషల్ మీడియాలో పెట్టటం వలనే, కొద్దో గొప్పో ఒకటి రెండు మీడియా సంస్థలు కవరేజ్ ఇచ్చాయి కానీ, లేకపోతే వాటి జోలికి వెళ్ళేవి కాదు.. ఇదేనా మీడియా ధర్మం…? నిజాల్ని నిర్భయంగా బయటపెట్టలేని మీడియా ఉంటే ఎంత లేకపోతే ఎంత..?