నారా లోకేష్ ‘రెండు’ కావాలంటున్నారట.! నిజమేనా.?

Lokesh  : 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లాలోని గాజువాక, పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసి, రెండు చోట్లా ఓడిపోయిన సంగతి తెలిసిందే. అంతకు ముందు, ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన మెగాస్టార్ చిరంజీవి కూడా రెండు స్థానాల్లో పోటీ చేశారుగానీ, ఓ స్థానంలో గెలిచి, ఇంకో స్థానంలో ఓడారు. తిరుపతి ఎమ్మెల్యేగా విజయం సాధించిన చిరంజీవి, పాలకొల్లులో మాత్రం పరాజయాన్ని చవిచూశారు.

రెండు చోట్లా పోటీ చేయడమంటే చాలా పెద్ద రిస్క్ అని చిరంజీవిని చూసి కూడా పవన్ కళ్యాణ్ జాగ్రత్తపడలేకపోయారు. ఒకే చోట ఆయన పోటీ చేసి వుంటే, ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళి వుండేవారే.. ప్రజా ప్రతినిథిగా ఆయనిప్పుడు ఓ బాధ్యతగల పదవిలో వుండేవారే.

అసలు విషయమేంటంటే, 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారట. అందులో ఒకటి ఖచ్చితంగా మంగళగిరి నియోజకవర్గమే అవుతుంది. రెండో నియోజకవర్గమేంటి.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి.

కుప్పం నియోజకవర్గంపై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టిన దరిమిలా, చంద్రబాబు ఈసారి హిందూపురం లేదా, ఇంకో నియోజకవర్గం వైపు చూసే అవకాశముంది. అదే గనుక జరిగితే, నారా లోకేష్.. డమ్మీ నియోజకవర్గం కింద కుప్పంని రెండో నియోజకవర్గంగా ఎంచుకునే అవకాశాలున్నాయట.

చంద్రబాబే కుప్పంతోపాటు, రెండో నియోజకవర్గం కూడా ఎంచుకోవచ్చు కదా.? అంటే, ఆ రిస్క్ లోకేష్ తీసుకోవాలనుకుంటున్నారన్నది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోన్న హాటెస్ట్ గాసిప్.