దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి ఎదురు కావడం తెరాసను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. పైకి ధైర్యంగా కనిపిస్తున్నా లోపల మాత్రం అంతర్మథనం మొదలయ్యే ఉంటుంది. సిట్టింగ్ స్థానం, ఆపై సానుభూతి, అన్నిటినీ మించి ట్రబుల్ షూటర్ హరీష్ రావు సారథ్యం, కేసీఆర్ పర్యవేక్షణ. ఒక సార్వత్రిక ఎన్నికలకు కావాల్సిన సన్నద్ధత ఇది. అయినా ఓడిపోయారు. తెరాస చరిత్రలో ఇంతటి పరాభవం ఎన్నడూ లేదు. తెరాస ఓటమికి బీజేపీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ ఒక్కటే కారణమని అనుకోలేం. ఎంత ఆదరణ పెరిగినా, తెరాస మీద వ్యతిరేకత పనిచేసినా ఓడిపోవడమనేది దాదాపు అసాధ్యమనే అనుకున్నారు కేసీఆర్ కూడ. అయినా ఆయన లెక్కలు తప్పాయి. అంటే తెర వెనుక ఏవో శక్తులు బలంగా పనిచేశాయని స్పష్టంగా అర్థమవుతూనే ఉంది.
ఇప్పుడు ఆ శక్తులు ఏమిటనేది కనుగొనే పనిలోనే ఉన్నారట కేసీఆర్ అండ్ టీమ్. ఈ ప్రాసెస్లో అనుమానం ఉన్న ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్నారట. ఈ పరిశీలనలో వారికి అనూహ్యంగా చంద్రబాబు నాయుడు అనే తీగ తగిలింది. ఎందుకంటే కేసీఆర్ మీద ఇరు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజేపీల తర్వాత అంతటి పంతం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు మాత్రమే. కేసీఆర్ అంటేనే ఆయనకు గిట్టదు. ఎందుకంటే కేసీఆర్ ఇచ్చిన ట్రీట్మెంట్ అలాంటిది మరి. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే కేసీఆర్ ను దెబ్బతీయడానికి బద్దవిరోధి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపిన చరిత్ర ఆయనది. ఎన్నికల్లో ఆయన వ్యూహం ఫలించలేదు. అది వేరే సంగతి. అప్పటి నుండి తెలంగాణ రాజకీయాల్లో ఆయన జోక్యం చేసుకోకుండా చేసేశారు కేసీఆర్.
ఏకంగా ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరాన్ని ఉన్నపళంగా వదిలేసి వెళ్లేలా చేశారు. అందుకే అవకాశం కోసం కాచుకుని కూర్చున్న చంద్రబాబు దుబ్బాకలో ఏమైనా వేలు పెట్టారా అనే అనుమానములు మొదలయ్యాయట. ఎందుకంటే దుబ్బాకలో తెలుగుదేశం లేకపోవచ్చు. కానీ ఆ పార్టీ వేళ్ళు మాత్రం ఉన్నాయి. గతంలో నాలుగుసార్లు దుబ్బాకలో టీడీపీ జెండా ఎగరేసింది. కాబట్టి కేడర్ అంతో ఇంతో ఉండే అవకాశం ఉంది. వాళ్ల ద్వారా బీజేపీకి అనుకూలంగా సైలెంట్ ఓటింగ్ చేయించారనే అనుమానం కలుగుతోందట. పైపెచ్చు దుబ్బాకలో బీజేపీని గెలిపించడం, వారి మన్ననలు పొందడం బాబుకు చాలా అవసరం. బీజేపీ గెలుపును బాబుగారు చాలా బాగా ఆస్వాదించారు. తెలంగాణలో సహకరిస్తే ఏపీలో రూట్ క్లియర్ అవుతుందనే ప్లాన్ చేసి ఉండవచ్చని, అందుకే నిశ్శబ్దంగా చేయాల్సింది చేసేసి ఉంటారని భావిస్తున్నారు.
అయితే ఇది చాలా కష్టమైన ప్రక్రియే అయినా జరగడానికి ఎంతో కొంత చోటుంది. గాలి దూరే గ్యాప్ ఉంటేనే సాంతం ఆక్రమించేయాలనే తత్త్వం బాబుగారిది. కాబట్టి కష్టమైనా సరే కార్యాన్ని పూర్తిచేసి ఉండవచ్చు. ఇప్పటికైతే ఇది కేవలం అనుమానం మాత్రమే. అందుకే ఎవ్వరూ నోరు తెరిచి మాట్లాడలేకపోతుండొచ్చు. ఈ అనుమానంతోనే లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారట. ఒకవేళ ఇందులో చంద్రబాబే చక్రం తిప్పారని నిరూపితమైనా కూడ బయటికి చెప్పలేరేమో తెరాస నేతలు. చెబితే చంద్రబాబు ప్రభావం ఇంకా తెలంగాణలో పనిచేస్తోందనే సంకేతాలు వెళ్లిపోతాయి. కాబట్టి చంద్రబాబు చేసినా చేయకపోయినా అసలు విషయం మాత్రం ఎప్పటికీ రహస్యంగానే మిగిలిపోతుంది.