రాజకీయాల్లోకి ఐపీఎస్ అధికారులు.. కొత్తేం కాదు కదా.!

సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. త్వరలో ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారు. అయితే, అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరతారా.? కొత్త రాజకీయ వేదికను ప్రారంభిస్తారా.? అన్నదానిపై భిన్న వాదనలు వున్నాయి. రాజకీయాల్లో వచ్చేందుకు వీలుగానే ప్రవీణ్ కుమార్, స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. నిజానికి, ఐపీఎస్ అధికారులిలా రాజకీయాల్లోకి రావడం కొత్త విషయమేమీ కాదు.

2019 ఎన్నికలకు ముందు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ కూడా స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. రాజకీయాల్లోకి వచ్చారు. నిజానికి, సొంతంగా ఆయన రాజకీయ పార్టీ పెట్టాలనుకున్నారు. లోక్ సత్తా పార్టీపైనా ఆయన ఆలోచనలు చేశారు. బీజేపీ వైపు కూడా చూశారు. చివరికి జనసేన పార్టీలో చేరి, జనసేన నుంచి లోక్ సభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరి, ప్రవీణ్ కుమార్ పరిస్థితి ఏంటి.? ఓ బలమైన ఓటు బ్యాంకుని నమ్ముకుని ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారు. వారి సంక్షేమం కోసమే తాను స్వచ్ఛంద పదవీ విరమణ (ఉద్యోగం నుంచి) చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు ప్రవీణ్ కుమార్.

అయితే, రాజకీయాల్లోకి రావడానికి ముందు.. ఆ తర్వాత పరిస్థితులు చాలా భిన్నంగా వుంటాయి. అది లక్ష్మినారాయణ విషయంలోనే ప్రూవ్ అయిపోయింది. అలాగని, ఐపీఎస్ అధికారులు రాజకీయాల్లో రాణించలేరని చెప్పలేం. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆయనతో పోటీ చేయించడానికే తెలంగాణ రాష్ట్ర సమితి వ్యూహాత్మకంగా అడుగులేసిందనే ప్రచారం జరిగినప్పటికీ, ఆయన మాత్రం హుజూరాబాద్ నుంచి పోటీ చేసే అవకాశమే లేదని తేల్చేశారు. ఏమో, రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పుడైనా, ఎలాగైనా మారిపోవచ్చు.