IPS AB Venkateswara Rao : సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుని తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నట్లు ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు హయాంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ విభాగం అధిపతిగా పని చేశారు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన పని చేశారనీ, అప్పటి ప్రతిపక్షం వైసీపీ గొంతు నొక్కారనీ ఆరోపణలున్నాయి.
ఆ ఆరోపణల నేపథ్యంలోనే అధికారంలోకి వస్తూనే, ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు వేసింది వైఎస్ జగన్ సర్కార్. అప్పటి నుంచి ఆయన న్యాపోరాటం చేస్తూనే వచ్చారు. చివరికి సర్వోన్నత న్యాయస్థానంలో ఆయనకు ఊరట లభించింది. కేసు విచారణ సమంయంలో ఏబీ వెంకటేశ్వరరావు జగన్ సర్కారు మీద ఏం మాట్లాడరన్నది వేరే చర్చ.
ఇప్పుడాయన మళ్ళీ విధుల్లో చేరినట్లే. సో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయకూడదు. అయితే, తన అనుభవాన్నంతా రంగరించి, ఏబీ వెంకటేశ్వరరావు తెలివిగా ప్రభుత్వ పెద్దలపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ వ్యవహారం వివాదాస్పదమవుతోంది.
‘గతంలో నేను తప్పులు చేసి వుంటే.. అధికారంలోకి వచ్చాక మీరు ఏం పీకారు..’ అంటూ ఏబీ వెంకటేశ్వరరావు అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపైనా వెటకారపు వ్యాఖ్యలు చేశారు ఏబీవీ.
కాగా, తన మీద అత్యంత దారుణంగా అధికార పార్టీ నాయకులు వ్యాఖ్యలు చేసిన దరిమిలా, అందుకు కౌంటర్ ఎటాక్ ఏబీవీ నుంచి ఇలా వస్తోందనే వాదన లేకపోలేదు. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు వేరు.. అధికారులు వేరు. అందునా సీనియర్ ఐపీఎస్ అధికారి.. తన పరిమితులకు లోబడి వ్యవహరించాలి.