అమరావతి పేరుతో ఇన్‌సైడర్ ట్రేడింగ్ !!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరుతో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ చాలాకాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోన్న విషయం విదితమే. చంద్రబాబు హయాంలో అమరావతి పేరుతో నిలువునా దోచేశారన్నది వైసీపీ ఆరోపణ. అధికారంలోకి వస్తూనే, టీడీపీ దోపిడీపై విచారణకు ఆదేశించింది వైఎస్ జగన్ సర్కార్. మంత్రి వర్గ ఉప సంఘం, ఏపీ సీఐడీ విచారణ.. ఇలా పెద్ద కథే నడుస్తోంది. అయితే, న్యాయస్థానాల్లో మాత్రం ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలకు చుక్కెదురవుతోంది. సాంకేతిక కారణాలతోనే ఇన్‌సైడర్ అభియోగాల్ని న్యాయస్థానాలు కొట్టివేస్తున్నట్లు భావిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు.

మరో రూపంలో అయినా, అమరావతి కుంభకోణాన్ని బట్టబయలు చేస్తామనీ, దోషుల్ని శిక్షించడం ఖాయమనీ సజ్జల ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘మా ప్రభుత్వం, ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందనే నమ్మతోంది..’ అని సజ్జల చెప్పుకొచ్చారు. అయితే, న్యాయస్థానాల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు వీగిపోయాక, వైసీపీ ఈ వ్యవహారంపై ఎలా ముందడుగు వేయగలుగుతుందన్నది చర్చనీయాంశంగా మారింది. నిజానికి, అమరావతికి సంబంధించి బాధితులెవరూ ముందుకు రావడంలేదు. అసలు బాధితులే లేరన్నది టీడీపీ వాదన. బాధితులు వున్నారని వైసీపీ అంటోంది. రాజధాని అమరావతి పరిధిలో పది మందో, పాతిక మందో… వంద మందో, వెయ్యి మందో.. ఖచ్చితంగా బాధితులు వుండే వుండాలన్నది వైసీపీ వాదన అయినప్పుడు, వారి ద్వారా కేసులు ఎందుకు పెట్టించలేకపోతోంది.? అన్నది అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోన్న ప్రశ్న. అధికారం చేతిలో వుండీ, వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ విషయంలో ఫెయిలవుతుండడం ఆశ్చర్యకరమే.