భారత్-పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న క్షణం దగ్గరపడుతోంది. క్రీడల మంత్రిత్వ శాఖ తమ ఇటీవల ప్రకటించిన విధానంతో ఈ ఉత్కంఠకు తెరదించింది. పాకిస్థాన్తో ద్వైపాక్షిక సిరీస్లు లేవని స్పష్టం చేసినప్పటికీ, అంతర్జాతీయ టోర్నమెంట్లలో మాత్రం రెండు జట్లు ఒకరికొకరు తలపడటానికి ఎలాంటి అడ్డంకులు లేవని తెలిపింది. దీంతో వచ్చే నెల యూఏఈలో జరగనున్న ఆసియా కప్లో భారత్-పాక్ పోరుకు మార్గం సుగమమైంది.
ద్వైపాక్షికాలకు నో, మల్టీలేటరల్ టోర్నీలకు గ్రీన్ సిగ్నల్: పాకిస్థాన్ తో ద్వైపాక్షిక సిరీస్లు ఇక జరగవని కేంద్రం తెలిపింది.. భారత్ పాక్ కి వెళ్లడం.. వాళ్లు ఇక్కడికి రావడం కష్టమని పేర్కొంది. అయితే, అంతర్జాతీయ క్రీడా సమాఖ్యల కింద జరిగే టోర్నీల్లో మాత్రం ఇరుదేశాల జట్లు పాల్గొంటాయని ప్రభుత్వ విధాన ప్రకటనలో పేర్కొంది. భారత్ ఆతిథ్యమిచ్చే బహుళ జట్ల ఈవెంట్లలో కూడా పాకిస్థాన్ జట్లకు అవకాశముంటుందని వెల్లడించింది.
ఇక సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈలో ఆసియా కప్ టోర్నమెంట్ జరగనుంది. టీ20 ఫార్మాట్లో జరుగుతున్న ఈ టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్ సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడుతుంది. అనంతరం సెప్టెంబర్ 14న దుబాయ్ స్టేడియంలో పాకిస్థాన్తో తలపడనుంది. సెప్టెంబర్ 19న భారత్-ఒమన్ మ్యాచ్ కూడా ఉండనుంది. బీసీసీఐ ఆతిథ్య హక్కులు కలిగి ఉన్నప్పటికీ, రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మొత్తం షెడ్యూల్ యూఏఈలోనే ఖరారు చేశారు.
ఇదిలా ఉంటే భారత్-పాకిస్థాన్ మధ్య చివరిసారి ద్వైపాక్షిక సిరీస్ 2012-13లో జరిగింది. అప్పటి నుంచి ఈ రెండు దేశాలు పరస్పర సిరీస్లు ఆడకపోయినా, వరల్డ్ కప్లు, చాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ వంటి బహుళ జట్ల టోర్నీల్లో మాత్రం తరచూ తలపడుతూ వచ్చాయి. ప్రతి మ్యాచ్ కోట్లాది అభిమానులను స్క్రీన్ల ముందు కూర్చోబెట్టి పండగ వాతావరణాన్ని సృష్టిస్తోంది.
భారత్-పాక్ మ్యాచ్ అంటే కేవలం క్రీడ మాత్రమే కాదు, భావోద్వేగం కూడా. అభిమానులు సోషల్ మీడియాలో ఇప్పటికే టికెట్ డిమాండ్, జెర్సీలు, ఫాన్ ఆర్ట్లతో ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు. టోర్నీలో యూఏఈలో నివసిస్తున్న భారీ సంఖ్యలో దక్షిణాసియా వాసుల కారణంగా స్టేడియం ప్రేక్షకులతో కిక్కిరిసే అవకాశం ఉంది.
క్రికెట్ విశ్లేషకులు ఈ మ్యాచ్ను సూపర్ హై టెన్షన్ మ్యాచ్ గా వర్ణిస్తున్నారు. రాజకీయ వాతావరణంలో అప్పుడప్పుడు తలెత్తే ఉద్రిక్తతల కారణంగా, ఇరుదేశాల మధ్య ప్రతి మ్యాచ్ మరింత ప్రత్యేకత సంతరించుకుంటుంది.
