ఆందోళనాగ్ని.! దేశం తగలబడటం వెనుక.!

అగ్నిపథమట.! అదేం పథకమో ఏమోగానీ, నిరుద్యోగులు, విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగుతున్నారు. రైళ్ళు తగలబడుతున్నాయి, విద్వంసాలు చోటు చేసుకుంటున్నాయి. ‘అబ్బే, ఇందులో వివాదమేమీ లేదు..’ అంటూ దేశం తగలబడుతోంటే, ఆ మంటల్లో చలికాచుకుంటోంది కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్.

అసలు వివాదమేంటి.? అన్నది ఇప్పుడెవరికీ అనవసరం. జరుగుతున్న రచ్చ ఎలా ఆగుతుంది.? అన్నదే కీలకం. ఆ మధ్య రైతుల్ని ఉద్ధరించేస్తామంటూ కొత్త సాగు చట్టాల్ని కేంద్రం తెచ్చింది. ‘మీరేమీ మమ్మల్ని కొత్త సాగు చట్టాలతో ఉద్ధరించాల్సిన పనిలేదు..’ అంటూ రైతులు రోడ్డెక్కారు. దేశం భగ్గుమంది.. చాలా నెలలపాటు ఉద్యమం జరిగింది. చివరికి కేంద్రం దిగొచ్చింది.

పలువురు రైతులు ప్రాణాలు కోల్పోయారు.. విధ్వంసాలు చోటు చేసుకున్నాయి.. ఇంత జరిగితేగానీ, నరేంద్ర మోడీ సర్కార్ వెనక్కి తగ్గలేదన్నమాట. మరిప్పుడు ఏమవుతుంది.? అగ్నిపథ్.. అనే వివాదం ఇప్పుడెందుకు తెరపైకొచ్చింది.? ఏమోగానీ, వున్నపళంగా ప్రధాని నరేంద్ర మోడీ డ్యామేజీ కంట్రోల్ చర్యలు చేపట్టాల్సిందే.

సంస్కరణలనేవి, అభివృద్ధి దిశగా జరగాలి. అంతే తప్ప, విద్వంసాలకు ఆస్కారమిచ్చేలా వుండకూడదు. ‘విపక్షాల దుష్ప్రచారం..’ అంటూ నెపాన్ని విపక్షాల మీదకు నెట్టేసి, తప్పించుకోవడం పాలక పక్షాలకు అలవాటైపోయింది. ప్రతి విధ్వంసం వెనుకా, అధికారంలో వున్నవారి పాత్ర సుస్పష్టం. అది ప్రత్యక్షంగానా.? పరోక్షంగానా.? అన్నదే కీలకం.

ఆందోళనకారులు సైతం, ఈ విధ్వంసాలతో ప్రపంచం దృష్టిలో మన దేశం పలచనైపోతుందని గుర్తెరగాలి. ఎవరో రెచ్చగొడితే, రెచ్చిపోయి.. తమ సొంత ఆస్తుల్ని తగలబెట్టుకోవడం దారుణం. రైల్వే ఆస్తులంటే అవి ప్రభుత్వ ఆస్తులు కావు, ప్రజల ఆస్తులు.