Beauty Tips:ఉలవలు మన శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. భారతదేశంలో లభించే నవధాన్యాలలోఉలవలు కూడా ఒకటి . ఉలవలలో ఆరోగ్యానికి మేలు చేసే ఫాస్పరస్, ఫైబర్, క్యాల్షియం, ఐరన్, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయి. వీటితో ఎన్నో రకాల వంటలు చేస్తుంటారు. అందులో ఎక్కువమంది ఉలవచారు ఇష్టపడుతుంటారు. ఒకప్పుడు ఏడ్లకి ,గుర్రాలకు ఆహారంగా వీటిని పెట్టారు. అప్పట్లో ఇది కేవలం పేద వారి ఇంట్లో అప్పుడప్పుడు గుగ్గుళ్ళ లాగానో, లేక చారు కాచుకుని తినేవారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు వారి శరీర ఆరోగ్యం కోసం ఉలవలు తింటున్నారు. ఫలితంగా ఉలవలు తినే వారి సంఖ్య బాగా పెరిగింది. అంతే కాదు ఇప్పుడు ఉలవలతో చేసే వంటకాల యొక్క రేటు కూడా ఎక్కువే.
ఉలవల లో ఉండే అన్ని పోషకాలు (న్యూట్రియంట్స్) మరే ఇతర ధాన్యాలలో లభించవు అంటే అతిశయోక్తి కాదు. ప్రతి 100 గ్రాముల ఉలవ గుగ్గిళ్ళ లో 371 కేలరీల శక్తి, 22 గ్రాముల ప్రోటీన్లు, 57 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 287 మిల్లీ గ్రాముల కాల్షియం, 311 గ్రాముల ఫాస్పరస్ తో పాటు చాలా ఎక్కువ మొత్తంలో పీచు పదార్థం ఉంటుంది. పెరిగే పిల్లలకు ఎక్కువ పోషకాహారం ఇవ్వాలని డాక్టర్లు సూచిస్తుంటారు, ఎదిగే పిల్లలకు ఉలవలకు మించిన పోషకాహారం మరి ఏది ఉండదు.
ఉలవలు ఆరోగ్యానికే కాదు చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ముఖాన్ని కాంతివంతంగా చేయడంలో ఉలవలు ఎంతో సహాయ పడతాయి. చర్మ సౌందర్యానికి ఉలవలను ఎలా ఉపయోగిస్తే మేలు జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం.
*ముందుగా ఉలవలను మెత్తగా పిండి లాగా చేయాలి, ఈ పిండి లోకి కొద్దిగా పాలను పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో మొహం కడుక్కోవాలి. ఈ పద్దతిని వారంలో రెండు లేదా మూడు సార్లు చేయడం వల్ల ముఖం మీద ఉన్న మొటిమలు తగ్గిపోయి, ముఖం ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
*ఉలవ పిండిలో కొద్దిగా తేనె వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం మీద రాసి ఒక పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో మొహం కడుక్కోవాలి.ఇలా చేయటం వల్ల ముఖం మీద ఉన్న మొటిమలు, మచ్చలు తగ్గిపోయి ఫేస్ నీట్ గా, మృదువుగా మారుతుంది.
*ముఖం మీద మృతకణాలు, మురికి తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారాలంటే ఉలవ పిండిలో చిటికెడు పసుపు ఇంకా పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్ర పరుచుకోవాలి.