హుజూరాబాద్ బై పోల్: ఈటెల సంగతేంటో తేలిపోనుంది.!


మాజీ మంత్రి ఈటెల రాజేందర్ భవిష్యత్తుకి హుజూరాబాద్ ఉప ఎన్నికతో శుభం కార్డు పడుతుందా.? అధికా తెలంగాణ రాష్ట్ర సమితి మీద బీజేపీ పైచేయి సాధిస్తుందా.? దళిత బంధు పథకం సంగతేంటి.? హుజూరాబాద్ ఉప ఎన్నిక జరిగే తేదీ ఖరారయిన దరిమిలా, తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతున్న విషయాలివి. పార్టీ నుంచి ఈటెల రాజేందర్‌ని బయటకు పంపే క్రమంలో ఆయన మీద తొలుత అవినీతి ఆరోపణలు, భూ కబ్జా ఆరోపణలు చేసి, మంత్రి పదవి నుంచి తొలగించి.. నానా రకాల అవమానాలకూ గురిచేశారు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అలియాస్ కేసీయార్. అయితే, ఈటెల తన మీద జరిగిన కుట్రని ధైర్యంగా ఎదుర్కొనేందుకు ప్రయత్నించారు, కొంతమేర సక్సెస్ అయ్యారు కూడా.

కానీ, రాజకీయాల్లో గెలుపోటములతోనే అసలు లెక్క తేలుతుంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటెల రాజేందర్ గెలుస్తారా.? గెలిచి తన స్థానాన్ని నిలబెట్టుకుంటారా.? తన స్థాయిని పెంచుకుంటారా.? గెలిస్తే మాత్రం.. ఈటెల రాజేందర్ ‘జెయింట్ కిల్లర్’ అనే గుర్తింపు పొందుతారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఖాతా నుంచి ఒక సీటు పోతుందంతే. కానీ, ఆ పార్టీకి రాజకీయంగా చాలా నష్టం జరుగుతుంది. అందుకే, హుజూరాబాద్ వేదికగా గులాబీ పార్టీ గత కొద్ది రోజులుగా చేస్తున్న పబ్లిసిటీ స్టంట్లు అన్నీ ఇన్నీ కావు. డబ్బు పంపకాలు ఎప్పుడో ప్రారంభమైపోయాయ్. అధికారికంగా దళిత బంధు పేరుతో మరో పబ్లిసిటీ స్టంట్ నడుస్తోంది. అధికార పార్టీ ఇన్ని రకాలుగా బల ప్రయోగం చేస్తున్న దరిమిలా, ఈటెల రాజేందర్ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుంది.? బీజేపీ గట్టిగా నిలబడితే, ఈటెల గెలుపు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. చూద్దాం.. ఏం జరుగుతుందో.!