సోనూ సూద్ పెరట్లో డబ్బు చెట్టు ఏమన్నా వుందా.? దాన్ని దులిపేసి ఖర్చు చేస్తున్నాడా.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. అందుక్కారణమూ లేకపోలేదు. ఫలానా సమస్య.. అని ఎవరన్నా సోషల్ మీడియాలో సోనూ సూద్ పేరు ట్యాగ్ చేస్తే, ఆ సమస్య నిజమైనదేనని ఖరారు చేసుకున్న వెంటనే సమస్య పరిష్కారం కోసం సోనూ సూద్ చర్యలు చేపడుతున్నాడు. కొన్నిసార్లు, సమస్య సరైనది కాకపోయినా, సోనూ సూద్ సాయం చేయడంలో మాత్రం వెనుకాడ్డంలేదు. నిజానికి, ప్రభుత్వాలు చేయాల్సిన పని ఇది. ప్రభుత్వం.. అంటే బోల్డంత యంత్రాంగం వుంటుంది.
వాళ్ళంతా సరిగ్గా పనిచేస్తే, అసలు సమస్యలే వుండవు. యంత్రాంగం పనిచేయదు.. అధికారంలో వున్నోళ్ళు బాధ్యతాయుతంగా వ్యవహరించరు.. అదే అసలు సమస్య. మరి, సోనూ సూద్ ఇలా ఎలా చేయగలుగుతున్నాడు.? ఓ వ్యక్తి సోషల్ మీడియాలో మృతదేహాల్ని కొద్ది సమయం పాటు భద్రపరిచే ఫ్రీజర్ బాక్సుల కోసం సోనూ సూద్ సాయం కోరాడు. తమ గ్రామంతో పాటు, తెలుగు రాష్ట్రాల్లోని చాలా గ్రామాల్లో ఈ సౌకర్యం లేదని పేర్కొన్నాడు. అంతే, సోనూ సూద్ రిప్లయ్ ఇచ్చేశాడు.
వారంలో వాటిని ఏర్పాటు చేస్తానన్నాడు. ఇంకో ట్వీటులో ఓ చిన్నారి లివర్ మార్పిడి సర్జరీ కోసం ఆ చిన్నారి తల్లిదండ్రులు సోషల్ మీడియా ద్వారా సాయం అర్థిస్తే, సర్జరీ జరిగిపోయిందనే అనుకోండి.. ధైర్యంగా వుండండి.. అని భరోసా ఇచ్చాడు.
నిజానికి, సోనూ సూద్ అందిస్తున్న సేవల్ని చూశాక ఎవరైనా మహాత్ముడు.. అనకుండా వుండలేరు. ఇదెలా సాధ్యమవుతోంది.? లక్షలు.. కోట్లు సరిపోవు.. ఇలా సాయం చేయడానికి. కానీ, మనసున్న చోట మార్గం వుంటుందని పెద్దలు ఊరకనే చెప్పలేదు. మెగాస్టార్ చిరంజీవి దాదాపు 60 కోట్లు ఖర్చు చేసి తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంకుల్ని ఏర్పాటు చేస్తున్న విషయం విదితమే. ఈ గొప్ప కార్యక్రమం కోసం ఓ చిన్నారి, తాను దాచుకున్న మొత్తాన్ని సాయంగా అందిస్తానని ప్రకటించింది. సాయం చేసేటోళ్ళతో చేతులు కలిపేవారూ వుండబట్టే.. ఆ సాయం ఎన్నో ప్రాణాల్ని కాపాడుతోంది.