Sonu Sood: సోనూ సూద్ అరెస్ట్ వారెంట్ వివాదం.. రియల్ హీరో ఏమన్నాడంటే?

సోనూ సూద్ పేరు వినగానే సాధారణంగా మానవతా స్పూర్తి కలిగిన నటుడిగా గుర్తుకొస్తాడు. సినిమా ఇండస్ట్రీలో విలన్‌గా పేరు తెచ్చుకున్నప్పటికీ, నిజ జీవితంలో మాత్రం అనేకమంది కోసం రియల్ హీరోగా నిలిచాడు. ముఖ్యంగా కరోనా సమయంలో వలస కార్మికులకు సహాయం చేసి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాడు. ఆయన సేవా కార్యక్రమాలకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అయితే, ఇప్పుడు ఆయన పేరు ఓ వివాదంలో ముడిపడింది. లూథియానా కోర్టు తాజాగా సోనూ సూద్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేయడం కలకలం రేపింది.

ఈ కేసు వివరాల్లోకి వెళితే, లూథియానాకు చెందిన న్యాయవాది రాజేష్ ఖన్నా తనకు రూ.10 లక్షల మోసం జరిగిందని కోర్టులో ఫిర్యాదు చేశాడు. క్రిప్టోకరెన్సీ స్కామ్ పేరుతో మోహిత్ శుక్లా అనే వ్యక్తి ఈ మోసం చేశాడని ఆరోపించాడు. విచారణలో భాగంగా కోర్టు ఈ కేసుకు సంబంధించి సోనూ సూద్‌ను సాక్షిగా విచారించాలనే నిర్ణయం తీసుకుంది. అయితే, అతనికి అనేక సమన్లు జారీ అయినప్పటికీ, కోర్టుకు హాజరుకాకపోవడంతో లూథియానా కోర్టు కఠినంగా స్పందించి అరెస్ట్ వారెంట్ ఇచ్చింది.

కోర్టు ఉత్తర్వుల ప్రకారం, ముంబై పోలీసులు ఆయనను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపర్చాల్సి ఉంటుంది. ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 10న జరగనుంది. ఈ అరెస్ట్ వారెంట్ వార్త సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. అయితే, సోనూ సూద్ వెంటనే స్పందించి క్లారిటీ ఇచ్చారు. తనకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

‘‘నా పేరు పూర్తిగా అనవసరంగా ఈ వివాదంలోకి లాగబడింది. ఇది నా వ్యవహారం కాదు. మూడో వ్యక్తికి సంబంధించిన కేసులో నన్ను కోర్టు సాక్షిగా పిలిచింది. దీనిపై మా న్యాయవాదులు ఇప్పటికే స్పందించారు. నేను ఏ విధంగానూ ఈ కేసులో భాగం కాను. కొందరు పబ్లిసిటీ కోసం నా పేరును దుర్వినియోగం చేస్తున్నారు. ఇది చాలా బాధాకరం’’ అంటూ వివరణ ఇచ్చారు. సోనూ సూద్ ఈ వివాదంపై ఎలాంటి వార్తలు వచ్చినా కూడా, నెటిజన్లు మాత్రం ఆయన తీరు పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఎవరిని మర్చిపోను.. మీ  సంగతి తెలుస్తా.. | Vidadala Rajini oora mass warning | Telugu Rajyam