సోనూ సూద్.. కరోనా విపత్తులో దేశం కోసం నిస్వార్థంగా సేవ చేస్తున్న మంచి మనసున్న వ్యక్తి. వెండితెర మీద విలన్ వేషాలు వేసినా నిజ జీవితంలో మాత్రం హీరో అనిపించుకున్నాడు. దేశం మొత్తం ఆయన్ను రియల్ హీరో అంటోంది. దీంతో సోనూ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. జనంలో క్రేజ్ ఉన్న నటుడికి డిమాండ్ ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఇప్పటికే చాలామంది సోనూ సూద్ కోసం కథలు రాసుకుని ఆయన్ను అప్రోచ్ అయ్యారు. ఒకానొక సమయంలో పూరి జగన్నాథ్ మహేష్ కోసం రాసుకున్న ‘జనగణమన’ కథను సోనూతో చేయాలనుకుంటున్నట్టు వార్తలూ వచ్చాయి. కానీ ఏదీ ఫైనల్ కాలేదు.
తాజాగా మరొక స్టార్ డైరెక్టర్ సోనూ సూద్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యారని వార్తలు వస్తున్నాయి. ఆ దర్శకుడు ఎవరో కాదు క్రిష్. భిన్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నాడు క్రిష్. ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్ హీరోగా ‘హరి హర వీరమల్లు’ చిత్రం చేస్తున్నారు. ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్. సోనూ సూద్ కు ఉన్న ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఒక కథ రాసుకున్నాడట క్రిష్. ఇది కంప్లీట్ సోషల్ సబ్జెక్ట్ అని తెలుస్తోంది. పైగా ఇది పాన్ ఇండియా సినిమా అని పవన్ హీరోగా చేస్తున్న ‘హరి హర వీరమల్లు’ కంటే భారీ సినిమా అంటున్నారు. క్రిష్ కథను సోనూ సూద్ కి చెప్పడం ఆయన ఓకే చేయడం జరిగిపోయిందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతమేర వాస్తవముందో టెకీయాలంటే క్రిష్ నోరు విప్పాల్సిందే.