కొత్త జిల్లాల ఏర్పాటు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించినంత ఈజీగా లేదు. ఇప్పుడా అంశంపై అభ్యంతరం వ్యక్తం అవుతోన్న జిల్లాల్లో పెద్ద కాకనే రేగుతోంది. తమ జిల్లాని వదిలేయండి అంటూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైకాపా ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ముందే హెచ్చరించారు. స్థానికంగా రాజకీయ సమస్య తలెత్తుందని అభివృద్ది చెందిన ఎచ్చెర్ల, రాజాం లాంటి ప్రాంతాలు విజనయనగరంలో కలిసిపోతే శ్రీకాకుళం ఇంక వెనుకబడిపోతుందని ముందే చెప్పారు. అయితే ఇప్పుడా జిల్లా వాసులు ధర్మాన వెంటే నిలిచారు. ఎట్టి పరిస్థితుల్లో తమ జిల్లాను విభజించొద్దని…అదే జరిగితే పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగుతామని స్థానిక ప్రజలు హెచ్చరించారు.
ఇప్పటికే శ్రీకాకుళంలో జిల్లా అన్ని రకాలగా వెనుకబడిపోయిందని దీనికి తోడు రాజాం, ఎచ్చెర్ల ప్రాంతాల్ని విజయనగరం జిల్లా లో కలిపిస్తే తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. దీనిలో భాగంగా ఎచ్చెర్లకు సమీపంలో ఉన్న స్థానిక గ్రామాలైన కేశవరావు పేట పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామస్తులు అందోళన వ్యక్తం చేసారు. కింతలిమిల్లు, ఫరిదిపేట, పూడివలస, కనిమెట్ట సహా స్థానిక గ్రామాల ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఆ నిర్ణయాన్ని స్వాగతించమని హెచ్చరించారు. ఏర్పాటు కంటే ముందు సీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ అన్ని జిల్లాలు పర్యటించి ప్రజల అభిప్రాయాల్ని సేకరించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇలాంటి అభ్యంతరాలే ఇంకా కృష్ణా జిల్లా, గుంటూరుజిల్లా, ప్రకాశం జిల్లా, చిత్తూరు జిల్లాల్లో వ్యక్తం అవుతున్నాయి. లోక్ సభ స్థానాల ఆధారంగా కొత్త జిల్లాల ఏర్పాటు అన్ని జిల్లాల్లో ఆమోదయోగ్యంగా ఉండదన్నారు. ఆయా జిల్లాల రాజకీయ ఇబ్బందిలతో పాటు, అభివృద్ది చెందిన ప్రాంతాలు పక్క జిల్లాల్లో కలిసి పోతే ? తమ పరిస్థితి ఏంటని అభ్యంతరం వ్యక్త చేస్తున్నారు. ఈ జిల్లాల అన్నింటి నుంచి పెద్ద ఎత్తున అభ్యర్ధనలు వెల్లు వెత్తుతున్నాయి. కమిటీ దృష్టికి ఈ సమస్యలన్నింటితో పాటు ఎదురయ్యే సాంకేతిక సమస్యల్ని తీసుకెళ్తామని స్థానిక నేతలు చెప్పారు. అవసరం అనుకుంటే నిరసనలకు దిగుతామని హెచ్చరించారు.