ఫాన్స్ కి గుడ్ న్యూస్… ఇకపై డిజిటల్ స్క్రీన్ పై సందడి చేయనున్న చిరు?

కరోనా సమయం నుండి దేశంలో ఓటీటీల హవా నడుస్తోంది. ప్రేక్షకులు థియేటర్లలో కన్నా ఓటీటీలలో సినిమాలు చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా వెబ్ సిరీస్, రియాలిటీ షోస్ వంటివి కూడా నిర్వహిస్తూ ఓటిటి చానల్స్ దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో అల్లు అరవింద్ ఆధ్వర్యంలో సాగుతున్న ఆహా ఓటీటీ తెలుగులో అత్యధిక ఖాతాదారులు కలిగి ఉన్న ఓటీటీల జాబితాలో ఉంది. ఇప్పటికే సరికొత్త సినిమాలతో పాటు వెబ్ సిరీస్, రియాలిటీ షోలను నిర్వహిస్తూ నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోవడానికి ఆహా చేరువలో ఉంది.

ఇప్పటికే ఆహాలో ప్రసారమైన అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె, ఇండియన్ ఐడల్ తెలుగు వంటి షోలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక బాలకృష్ణ హోస్టుగా వ్యవహరించబోయే అన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా తొందర్లోనే ప్రారంభం కానుంది. ఇక ఆహా నంబర్ వన్ స్థానంలో చేర్చడానికి అల్లు అరవింద్ కొత్త ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా అన్ స్టాపబుల్ లాగే చిరంజీవితో కూడా ఒక అద్భుతమైన కార్యక్రమానికి అల్లు అరవింద్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అన్ స్టాపబుల్ లాగా చిరంజీవితో టాక్ షో నిర్వహించనున్నారు అనుకుంటే పొరపాటే. ఇప్పటివరకు మనదేశంలో ఎక్కడ ప్రసారం కానీ ఒక భిన్నమైన షోని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో ఒక ఇంగ్లీష్ ఛానల్ లో వస్తున్న ఒక కార్యక్రమాన్ని కాస్త మార్పులు చేసి తెలుగులో ఆహా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఆహాలో స్పెషల్ షో చేయటానికి చిరంజీవి కూడా సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆహాలో చిరంజీవికి కూడా కొద్ది పాటి వాటా ఉందని సమాచారం. అంతే కాకుండా ఈ షో కోసం చిరంజీవికి భారీ పారితోషికం లేదా వాటాను పెంచే విషయం పై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తొంది. ఇక ఆహాలో చిరంజీవి సందడి మొదలు పెడితే మెగా అభిమానులకు పండగే. అయితే ఈ వార్తల్లో ఎంత నిజముంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది.