గేట్లు సిద్ధం.! పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోయినట్లేనా.?

పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుంది.? అన్న ప్రశ్నకు, ‘నాకైతే తెలీదు.. నేను మంత్రి పదవిలో లేను..’ అంటూ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సెలవిస్తోంటే, ‘నన్ను ఆ విషయం అడక్కండి..’ అనేశారు కొత్త మంత్రి అంబటి రాంబాబు. ఇంతకీ, పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితేంటి.? వైఎస్ జగన్ హయాంలో పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందా.? లేదా.?

తాజాగా, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి అన్ని గేట్ల బిగింపు ప్రక్రియ పూర్తయినట్లు వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ గేట్ల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేశారు. అయితే, కొన్నాళ్ళ క్రితం పులిచింతల ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయిన దరిమిలా, విపరీతమైన ప్రవాహం వర్షాకాలంలో వుండే గోదావరి నదిపై నిర్మితమవుతున్న పోలవరం ప్రాజెక్టు గేట్ల భద్రత ఎంత.? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

సరే, ప్రాజెక్టుల రూపకల్పనలో అన్ని జాగ్రత్తలూ తీసుకోవాల్సిందే.. ఎవరు అధికారంలో వున్నాగానీ. కానీ, అలా జరుగుతోందా.? లేదా.? అన్నది మళ్ళీ వేరే చర్చ.

పోలవరం ప్రాజెక్టు గేట్లు అయితే పెట్టేశారు. ఇంతకీ, పోలవరం ప్రాజెక్టుని జాతికి అంకితం చేసేదెప్పుడు.? ఈ విషయమై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేంద్రం ఇంకా సవరించిన అంచనాలకు ఆమోదమే తెలపలేదు. పోలవరం జాతీయ ప్రాజెక్టు గనుక, ప్రాజెక్టుకి పూర్తిగా నిధులు ఇవ్వాల్సింది కేంద్రమే.

కేంద్రం నిధులు ఇవ్వకుండా పోలవరం ప్రాజెక్టు ముందుకు వెళ్ళదు. కేంద్రమేమో నిధులు ఇవ్వదు. గేట్లు పెట్టేశాం, కాలువలు తవ్వేశాం.. అని భజన చేసుకోవడం వల్ల ప్రయోజనమే వుండదు. పోలవరం ప్రాజెక్టు చుట్టూ జరుగుతున్న పబ్లిసిటీ స్టంట్లు తప్ప, ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందన్నదానిపై స్పష్టత లేకపోవడం శోచనీయం.