మంచి ఆరోగ్యం కోసం తాజా పండ్లు..! ఏమేం తినాలి..?

శరీరానికి శక్తిని ఇచ్చేది మంచి భోజనం మాత్రమే కాదు.. పండ్లు కూడా అనే విషయం తెలిసిందే. రకరకాల పండ్లు ఇచ్చే శక్తి, పోషకాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మనల్ని ఉత్తేజితుల్ని చేస్తాయి. పని ఒత్తిడిలో లేక అందుబాటులో భోజనం లేనప్పుడు, స్నాక్స్ తినాలనిపించినప్పుడు పండ్లు తింటే మరింత ఆరోగ్యం వస్తుంది. ఉప్పు, కారం, చక్కెర ఎక్కువగా ఉండే స్నాక్స్ ఐటమ్స్ కంటే తాజా ఫ్రూట్స్ తింటే చాలా ఉత్తమం. పనిలో ఉన్నప్పుడు, సాయంత్రం స్నాక్స్ తినే టైమ్ లో ఫ్రూట్స్ తింటే చేసే పనిలో ఉత్తేజం వస్తుందని చెప్తున్నాయి అధ్యయనాలు. పండ్లతోపాటే బాదం పప్పు, పిస్తా, వాల్ నట్స్ ఆరోగ్యానికి మంచిది.

స్నాక్స్ లో చిప్స్, పకోడీ, బజ్జీలకు బదులు ఫ్రూట్స్ తింటే మానసికోల్లాసం వస్తుందంటున్నారు. శరీరానికి విటమిన్లు, ప్రొటీన్లు అందిస్తాయి. కానీ పండుతో మన ఆకలి తీరదు. పండ్లతో పాటు బాదంపప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు, వాల్‌నట్స్ లాంటివి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అంతేకాకుండా పెరుగుతో చేసిన పదార్థాలు లాంటివి తీసుకుంటే శరీరానికి ప్రొటీన్లు, మంచి కొవ్వులు లభించి అదనపు శక్తిని ఇస్తాయి. ఉదాహరణకు ఒక యాపిల్ పండుతో పాటు కొన్ని వాల్‌నట్స్‌ను తీసుకుంటే ఆకలితో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది. మామిడి, బొప్పాయి, అరటి వంటి లేత పసుపు రంగు పండ్లలో విటమిన్-A ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.

బత్తాయి, నారింజ వంటి పండ్లు తింటే జలుబు చేస్తుందనేది అపోహ అని పలువురు వైద్యనిపుణులు స్పష్టం చేస్తున్నారు. పుల్లగా ఉండే పండ్లు శరీరానికి విటమిన్-C ఎక్కువగా లభిస్తుంది. దానిమ్మ, సపోటా, జామ వంటి పండ్ల వల్ల కేలరీలు ఎక్కువగా లభిస్తాయి. మొలకెత్తిన గింజలు తిన్నా శరీరానికి అదనపు శక్తి వస్తుంది. శాకాహారుల్లో బీ12 లోపం ఎక్కువ. వారు ఉసిరి, క్యారెట్, ఖర్జూరం వంటి డ్రైఫ్రూట్స్‌ను తీసుకుంటే పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. వెన్న తింటే శక్తి వస్తుంది.. కానీ ప్రతిరోజూ తింటే గుండెకు ప్రమాదం. వారానికి రెండు, మూడు సార్లు తినడం మంచిది.

గమనిక: ఈ వివరాలన్నీ ఆరోగ్య నిపుణులు ఆయా సందర్భాల్లో సూచించినవే ఇవ్వడం జరిగింది. కేవలం మీ అవగాహన కోసమే ఈ కథనం. మీకు ఏ చిన్న సమస్య ఎదురైనా తగిన పద్దతుల కోసం వైద్యులను సంప్రదించడమే ఉత్తమం. గమనించగలరు.