అందమైన చిరునవ్వు ప్రతి ఒక్కరి కల. కానీ ఆ చిరునవ్వును కాపాడే పనిలో మనమే తెలియక పెద్ద తప్పులు చేస్తున్నామంటే నమ్మగలరా..? రోజూ ఉదయం లేచి నిద్రలేచిన వెంటనే చేతిలోకి వచ్చే టూత్‌పేస్ట్‌నే పళ్ల ఆరోగ్యానికి ముప్పుగా మారుతోందని దంత వైద్యులు హెచ్చరిస్తున్నారు. మార్కెట్లో మెరిసే ప్యాకెట్లు, ఆకర్షణీయమైన ప్రకటనలు చూసి పేస్ట్ ఎంచుకుంటున్నాం తప్ప, అందులో ఏముందో ఆలోచించడంలేదు.
చాలా మంది తెల్లటి పళ్లు కావాలనే ఆశతో ‘ఇన్‌స్టంట్ వైటెనింగ్’ అని చెప్పే టూత్‌పేస్టుల వైపు పరుగులు పెడుతున్నారు. కానీ ఇవే పళ్ల పైపొరను మెల్లగా అరిగిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. పళ్లను రక్షించే ఎనామిల్ దెబ్బతింటే, చిన్న వయసులోనే పళ్లు సున్నితంగా మారిపోతాయి. చల్లని నీరు తాగినా, వేడి టీ తాగినా జివ్వున లాగడం మొదలవుతుంది. ఇది మొదట చిన్న సమస్యలా కనిపించినా, తర్వాత పెద్ద దంత సమస్యలకు దారి తీస్తుంది.
మరోవైపు ‘నేచురల్’, ‘హెర్బల్’ అనే పేర్లతో ఫ్లోరైడ్ లేని పేస్టులు కూడా విస్తృతంగా వాడుతున్నారు. ఫ్లోరైడ్ పళ్లను పుచ్చిపోకుండా కాపాడే కీలకమైన ఖనిజం. ఇది లేకపోతే బ్యాక్టీరియా వేగంగా పెరిగి పిప్పి సమస్యలు మొదలవుతాయి. అదే సమయంలో ఫ్లోరైడ్ మోతాదు కూడా నియంత్రణలో ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అతి ఎక్కువగా ఉంటే పళ్ల రంగు మారడం వంటి సమస్యలు తలెత్తవచ్చు.
పిల్లల కోసం అని రంగురంగులగా, తీపి రుచితో వచ్చే టూత్‌పేస్టుల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఇవి పిల్లలకు బ్రషింగ్ అలవాటు చేయడానికి ఉపయోగపడినప్పటికీ, అందులోని కృత్రిమ రంగులు, తీపి పదార్థాలు చిగుళ్లకు హాని చేసే అవకాశం ఉంది. టూత్‌పేస్ట్ అంటే తినే వస్తువు కాదని, కేవలం శుభ్రం చేసే సాధనమేనని తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఉంది.
ఇంకో పెద్ద తప్పు ఏమిటంటే.. ఎక్స్‌పైరీ డేట్ చూసుకోకుండా పేస్ట్ వాడటం. టూత్‌పేస్టులకు కూడా గడువు తేదీ ఉంటుంది. కాలం చెల్లిన పేస్టుల్లో రసాయనాలు మారిపోయి నోటిలో బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉంటుంది. దీని వల్ల నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలు రావచ్చు. చిన్న నిర్లక్ష్యం పెద్ద ఇబ్బందులకు కారణమవుతుంది.
దంతాల ఆరోగ్యం కోసం పెద్ద ఖర్చులు అవసరం లేదు. బ్రష్ చేసేటప్పుడు బఠానీ గింజంత పేస్ట్ సరిపోతుంది. మరీ గట్టిగా తోమడం వల్ల పళ్లు కాదు, చిగుళ్లే దెబ్బతింటాయి. మృదువైన బ్రిజిల్స్ ఉన్న బ్రష్ వాడటం, మూడు నెలలకు ఒకసారి బ్రష్ మార్చడం లాంటి చిన్న జాగ్రత్తలే చిరునవ్వును జీవితాంతం నిలబెట్టగలవు. రోజూ వాడే టూత్‌పేస్ట్ విషయంలో కాస్త ఆలోచిస్తే, పళ్ల సమస్యలు మీ దరి చేరవు.
