విశాఖపట్నం.. ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో అతి పెద్ద నగరం. ఆర్థిక రాజధాని.. అని కూడా చెప్పొచ్చు. విశాఖ తప్ప రాష్ట్రంలో మరో అభివృద్ధి చెందిన నగరం ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో లేదు. కానీ, ఆ విశాఖపట్నం విషయంలో నిత్యం నిర్లక్ష్యం రాజ్యమేలుతోందన్న విమర్శలున్నాయి. కొన్నాళ్ళ క్రితం విశాఖలో ఎల్జీ పాలిమర్స్ సంస్థలో చోటు చేసుకున్న ప్రమాదం పలువుర్ని బలిగొన్న సంగతి తెలిసిందే. విషవాయువులు లీక్ అవడంతో.. మనుషులు విగతజీవుల్లా పడిపోయారు. హర్రర్ సినిమాల తరహాలో నడుస్తూ నడుస్తూ మనుషులు కింద పడిపోవడం అప్పట్లో పెను దుమారం రేపింది. ఆ తర్వాత ఆ గొడవ అలా అలా సద్దుమణిగిపోయింది. అదొక్కటే కాదు, గడచిన రెండేళ్ళ కాలంలో విశాఖలు పలు పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.
కొన్ని ప్రమాదాల కారణంగా ప్రాణ నష్టమూ సంభవించింది. అయినాగానీ, పరిశ్రమల్లో భద్రతా లోపాల విషయమై చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడంలేదు. తాజాగా దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పరిశ్రమల్లో ఒకటైన హెచ్.పి.సి.ఎల్.లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా అగ్ని కీలలు పైకెగిసేసరికి విశాఖ వాసులు వణికిపోయారు. సుమారు గంటపాటు అగ్ని కీలలు కనిపించాయి. భద్రతా సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో ప్రాణ నష్టంపై ఇంకా ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. అయితే, ప్రాణ నష్టం ఏమీ జరగలేదనే అభిప్రాయాలు అక్కడి సిబ్బంది నుంచి వ్యక్తమవుతున్నాయి. ఆస్తి నష్టం మాత్రం పెద్దయెత్తున జరిగి వుండొచ్చని అంటున్నారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది.? అన్నదానిపై ప్లాంట్ యాజమాన్యం విచారణ చేపట్టనుంది.
విశాఖ నగరం ఇటీవలి కాలంలో బాగా విస్తరించింది. ఈ క్రమంలో ప్రమాదకర పరిశ్రమలు నగరం నడిబొడ్డుకి వచ్చినట్లయ్యింది. దాంతో, ఎప్పుడు ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో తెలియక విశాఖ వాసులు వణికిపోతున్నారు.