RGV : ఫిలిం మేకర్ ఆర్జీవీ.! ట్యాగ్ అదిరిందిగానీ.. సినిమాలేవీ.?

RGV : ఒకప్పుడు సినీ పరిశ్రమకు సంబంధించి సంచలనాలంటే రామ్ గోపాల్ వర్మ.. రామ్ గోపాల్ వర్మ అంటేనే సంచలనాలు. కానీ, ఇప్పుడో.. వివాదమంటేనే వర్మ.. వర్మ అంటేనే వివాదం. కాదు కాదు, వర్మ అంటే బూతు.. బూతు అంటే వర్మ. కాదు కాదు వోడ్కా అంటే వర్మ.. వర్మ అంటే వోడ్కా.!

మరీ, రామ్ గోపాల్ వర్మ మీద ఈ స్థాయిలో విమర్శలు అవసరమా.? అంటే, సినిమాలు తీయడం ఎప్పుడో వర్మ మానేశాడు. వివాదాల్ని తెరకెక్కించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. వర్మ ప్రకటించిన సినిమాలు, అందులో విడుదలైన సినిమాల్ని లెక్కేస్తే.. వర్మ ఘనత ఇటీవల ఎలా దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు.

నేను సినిమాలు తీస్తాను, నాకు నచ్చినట్టు తెరకెక్కిస్తాను, నాకు నచ్చినట్టు విడుదల చేస్తానంటాడు వర్మ. అలా వచ్చిందే, మియా మాల్కోవా నటించిన ‘జీఎస్టీ’. ఈ కోవలో చాలానే వున్నాయ్. సినిమాలైతే తీస్తూనే వున్నాడు వర్మ. వాటిని సినిమాలుగా చూడాలా.? లేదంటే, యూ ట్యూబ్ వీడియోలనాలా.? ఓటీటీ కంటెంట్ అనాలా.? అంటే, ఎవరిష్టం వాళ్ళది.

ఇప్పుడీ వర్మ, ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నానితో భేటీ అవుతుండడమే సంచలనంగా మారింది. ఇందులో సంచలనమేముంది.? వర్మ అపాయింట్మెంట్ కోరారు, మంత్రి అపాయింట్మెంట్ ఇచ్చారు. మంత్రితో భేటీ అయ్యారు. వర్మ తన వ్యూస్ ఏంటో మంత్రి పేర్ని నానికి వివరించడం.. రొటీన్ వ్యవహారం.

వర్మ లేవనెత్తిన ప్రశ్నలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిగొచ్చేస్తుందనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. ఎందుకంటే, వర్మ సినిమాలకీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల వ్యవహారానికీ అస్సలు సంబంధం లేదు. ఎందుకంటే, వర్మ తీసే చాలా సినిమాలు థియేటర్లలో కాకుండా ‘పే పర్ వ్యూ’ పేరుతో డిజిటల్ స్ట్రీమింగ్ చేసేస్తున్నారు గనుక.