వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకి నడిరోడ్డు మీద చుక్కలు కనిపించాయా? సొంత నియోజక వర్గం రైతులే వర్షాకాలంలో కూడా మిరు మిట్లు గొలిపే స్టార్స్ చూపించారా? అంటే అవుననే చెబుతోంది ఓ సన్నివేశం. అమరావతి రైతుల ఉద్యమం 250 రోజులు పూర్తయిన సంగతి తెలిసిందే. ఇంకా స్థానిక గ్రామాల్లో రైతు పోరాటం కొనసాగుతోంది. అయితే సొంత నియోజక వర్గం నగరి పర్యటనకు వెళ్లిన రోజాకు అక్కడి రైతులు అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతినిచ్చారు. రైతుల ఉద్యమానికి నగరి రైతులు సంఘీభావం తెలుపుతూ స్థానికంగా ఏర్పాటు చేసిన అంబద్కర్ విగ్రహానికి పూల మాల వేసారు. రైతు ఉద్యమంలో అసువులు బాసిన రైతులకు నగరి రైతులు నివాళులు అర్పించారు.
ప్రస్తుత పోరాటానికీ సంఘీభావం స్వచ్ఛందంగా ముందుకొచ్చి తెలిపారు. ఈ సందర్భంగా రైతులు జగన్మోహాన్ రెడ్డి ప్రభుత్వాన్ని దుయ్యబెట్టారు. జగన్ పాలన బ్రిటీష్ పరిపాలకుల పాలన కంటే దారుణంగా ఉందని ఆక్షేపించారు. 250 రోజుల నుంచి అమరావతి రైతులు పోరాటం చేస్తున్నా ప్రభుత్వానికి కనీసం చీమ కూడా కుట్టినట్లు లేదని నిప్పులు చెరిగారు. ఇది ఎంతో దారుణమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేసారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేసారు. దీంతో రోజాకి పట్టపగలే ప్రకాశ వంతంగా మెరిసే చుక్కలు కనిపించినట్లు అయింది. సొంత నియోజక వర్గం రైతులే మూడు రాజధానులను వ్యతిరేకించడంతో రోజా కి సౌండ్ లేదు.
ఆ సమయంలో రైతులను ఎలా సముదాయించాలో కూడా పాలుపోలేదు. సొంత నియోజక వర్గానికి ఎంతో ఆశతో వెళ్లిన రోజాకి ఆ విధంగా భగపాటు తప్పలేదు. అయితే ఇప్పటివరకూ లేని ఇలాంటి తిరుగుబాటు రావడం ఆశ్చర్యకరమే. ప్రతిపక్ష నేతలు చేయించిన పనా? లేక రోజా వ్యతిరేక గ్యాంగ్ ఇలా ప్లాన్ చేసిందా? ఆ రెండు గాక రైతులే స్వచ్ఛందంగా ముందుకొచ్చి తిరగబడ్డారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.