2014 ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు చేసిన రాజకీయం అంతా ఇంతా కాదు. జగన్ ను పూర్తిగా నేలమట్టం చేయడానికి వలసలను విపరీతంగా ప్రోత్సహించారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలను తనవైపుకు లాగేసుకున్నారు. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో వలసలు జరిగింది లేదు. ఈ వలసలు రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. పక్క పార్టీలో ఈ తతంగాన్ని చూసి నోరెళ్లబెడితే ఇక జగన్ పరిస్థితి ఏంటో ఊహించుకోవడం కూడ కష్టమే. నమ్మి టికెట్లు కేటాయించి ఎన్నికల్లో గెలిపిస్తే 23 మంది ఎమ్మెల్యేలు మోసం చేసి వెళ్లిపోవడంతో వైసీపీ పరిస్థితి అగమ్యగోచరమైంది. ఇక పార్టీకి భవిష్యత్తు ఉండదని, ఐదేళ్లలో చంద్రబాబు ప్రతిపక్షాన్ని నామరూపాలు లేకుండా చేస్తారని అందరూ అనుకున్నారు.
కానీ జగన్ కుంగిపోలేదు. జరిగిన మోసాన్ని కడుపులోనే దాచుకుని పైకిలేచారు. అనూహ్యంగా పుంజుకుని ముఖ్యమంత్రి అయ్యారు. 23 మంది ఎమ్మెల్యేలను లాగేసిన చంద్రబాబుకు చివరికి ఎన్నికల్లో 23 సీట్లు మాత్రమే రావడం కొసమెరుపు. అయితే అప్పట్లో పార్టీ మారి వచ్చిన 23 మంది ఎమ్మెల్యేల్లో కొందరికి మంత్రి పదవులను కూడ కట్టబెట్టిన చంద్రబాబు ఇంకొందరికి 2019 ఎన్నికల్లో టికెట్ హామీ ఇచ్చారు. కానీ ఎన్నికల నాటికి పరిస్థితులు తారుమారయ్యాయి. ఇచ్చిన మాటను బాబుగారు నిలబెట్టుకోలేకపోయారు. వైసీపీ నుండి వచ్చిన ఎమ్మెల్యేలు కొందరికి గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేకపోయారు.
టికెట్ పొందిన వారిలో ఒక్క గొట్టిపాటి రవి మినహా మిగతా అందరూ ఓడిపోయారు. అలా ఓడిపోయినవారు, ఎన్నికల్లో టికెట్ పొందలేని వారు పార్టీ పదవుల్లో అయినా తమకు స్థానం దక్కుతుందని ఆశించారు. కానీ వారికి ఆ ప్రాప్తం కూడ లేకుండా చేశారు చంద్రబాబు. జ్యోతల నెహ్రు కుమారుడికి తప్ప వలస నేతలు ఎవ్వరికీ పదవులు, పగ్గాలు ఇవ్వలేదు. దీంతో అప్పుడు, ఇప్పుడు కూడ చంద్రబాబు చేతిలో మోసపోయామని, వైసీపీలోనే ఉండి ఉంటే మంచి స్థాయిలో ఉండేవారమని, అప్పుడు జగన్ ను మోసం చేసి ఇప్పుడు చంద్రబాబు చేతిలో దగా పడ్డామని లోలోపల కుమిలిపోతున్నారు. వీరిలో చాలామందికి భవిష్యత్తు మీద ఆశలు కూడ లేవు.