గులాబీ నజర్: ‘ఈటెల పోటు’ భరించేదెలా.?

హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలో ఈటెల రాజేందర్ ఓడిపోయి వుంటే, సీన్ ఇంకోలా వుండేది. కానీ, ఈటెల రాజేందర్ గెలిచేశారు. ‘పులి వచ్చింది.. మేక సచ్చింది..’ అన్నట్టు తయారైంది అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పరిస్థితి. అంతకు ముందు వరకూ ఈటెల రాజేందర్‌ని ‘మేక’గా అభివర్ణించిన అధికార టీఆర్ఎస్, ఇప్పుడు ఈటెలను ‘పులి’లా గుర్తించక తప్పని పరిస్థితి.

‘అది బీజేపీ గెలుపు కాదు.. ఈటెల గెలుపు..’ అంటున్నారు కొందరు గులాబీ నేతలు. ‘అబ్బే, అది ఈటెల బలం కాదు.. సింపతీ బలం..’ అని అంటున్నారు ఇంకొందరు గులాబీ నేతలు. ఈటెల కారణంగా అధికార గులాబీ పార్టీ నేతలకి ఎంతటి తలనొప్పి వచ్చిందో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?

సాదా సీదా నాయకుల పరిస్థితే ఇలా వుంటే, హరీష్ రావు అలాగే కేటీయార్ పరిస్థితి ఏంటి.? మరీ ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి, గులాబీ పార్టీ అసలు సిసలు ఓనర్ కేసీయార్ పరిస్థితి ఇంకేంటి.? ‘మేం గులాబీ పార్టీకి ఓనర్లం..’ అని నినదించడంతోనే ఈటెల రాజేందర్, తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి గెంటివేయబడ్డారు.

ఈటెల, హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలిచింది మొదలు.. ఏదో ఒక సంచలనం చేస్తూనే వున్నారు. భారీ ర్యాలీలు, బోల్డంత హంగామా.. ఇదంతా జీర్ణించుకోవడం అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి అంత సులువైన వ్యవహారం కాదు. కానీ, ఈటెల విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించడానికి లేదు. ఎందుకంటే, ఇప్పుడు ఈటెల దేశంలో అధికారంలో వున్న బీజేపీకి చెందిన ఎమ్మెల్యే.

కటకటా.. ఈ కష్టం పగవాడిక్కూడా రాకూడదంటూ గులాబీ నేతలు లోలోపల గింజుకుంటున్నారట. ఈటెల గనుక, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే.? అప్పుడిక గులాబీ పార్టీ పరిస్థితి మరింత దయనీయమైపోతుంది.