భట్టి విక్రమార్కతో ఈటెల.. కాంగ్రెస్‌లోకి దూకే ఆలోచనా.?

Etela Starts Talks With Congress Party

Etela Starts Talks With Congress Party

కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్కతో తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ భేటీ అవడం రాజకీయంగా చర్చనీయాంశమయ్యింది. ఇటీవల ఈటెల రాజేందర్‌ని మంత్రి వర్గం నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలగించిన విషయం విదితమే. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటెలకు ధీటుగా పనిచేసే నాయకుడి కోసం గులాబీ బాస్ అప్పుడే వ్యూహరచన షురూ చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, తన రాజకీయ భవిష్యత్తుని వెతుక్కుంటూ వెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారా.? తనతో కలిసి రావాలని అడిగేందుకే కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారా.? అన్నదానిపై స్పష్టత లేదు.

అయితే, తెలంగాణలో కేసీఆర్‌కి వ్యతిరేకంగా అన్ని రాజకీయ శక్తుల్నీ కూడదీయాలన్న ఆలోచనతో ఈటెల వున్నట్లు కనిపిస్తోంది. ఆ దిశగా ఇప్పటికే ఈటెల రాజకీయ వ్యూహాన్ని ఖరారు చేశారని ఈటెల సన్నిహితుల్లో చర్చ జరుగుతోంది. అధికార పార్టీని ఎదుర్కోవడమంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈటెలకు సాధ్యమయ్యే పని కాదు. అయినాగానీ, ఉద్యమ నాయకుడిగా వున్న గుర్తింపు నేపథ్యంలో ఈటెల గనుక పక్కగా వ్యూహం రచిస్తే, అది కేసీఆర్‌కి కంటి మీద కునుకు లేకుండా చేస్తుందనేవాదనా లేకపోలేదు. ప్రస్తుతం కరోనా పాండమిక్ నడుస్తున్న నేపథ్యంలో భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై ఈటెల ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో, ఆయన తనతో కలిసొచ్చే నేతల వివరాల్ని తెలుసుకుంటూ వారితో టచ్‌లోకి వెళుతున్నారు. టీఆర్ఎస్ మాజీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇటీవల ఈటెలను కలిసిన విషయం విదితమే. కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఈటెలతో మంతనాలు జరుపుతున్నారు. ఈటెల కొత్త పార్టీ పెడితే, రాజకీయంగా ఆయనకు మరింత బలం చేకూరుతుందన్నవాదన తెలంగాణ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మరి, ఈటెల ఆలోచనలు ఎటువైపు ఆయన్ని తీసుకెళతాయో వేచి చూడాల్సిందే.