మాజీ మంత్రి ఈటెల రాజేందర్, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. ‘తెలంగాణ రాష్ట్ర సమితి గుర్తు మీద పోటీ చేసి గెలిచాను కాబట్టి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందే..’ అని చెప్పిన ఈటెల రాజేందర్, నియోజకవర్గ ప్రజలతో మాట్లాడాకే రాజీనామాపై స్పష్టత ఇస్తానన్నారు. సొంత నియోజకర్గం హుజూరాబాద్ వెళ్ళిన ఈటెల రాజేందర్, గత కొద్దిరోజులుగా అక్కడే వున్నారు. అనుచరులతోనూ, తనను కలిసేందుకు వస్తున్న ఇతర పార్టీలకు చెందిన నేతలతోనూ మంతనాలు జరుపుతున్నారు. అయితే, ఈ మంతనాల సందర్భంగా ‘రాజీనామా చేయొద్దు..’ అనే సూచన ఆయనకు చాలామంది చేస్తున్నారట. ‘కాంగ్రెస్ నుంచీ, టీడీపీ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితిలోకి ఎమ్మెల్యేలు వెళ్ళారు.
వాళ్ళెవరూ తమ తమ పదవులకు రాజీనామా చేయలేదు. మీరెందుకు రాజీనామా చేయాలి.?’ అని ఓ మాజీ ఎంపీ తనను ప్రశ్నించేసరికి ఈటెల రాజేందర్ సమాధానం చెప్పేందుకు కాస్త తటపటాయించాల్సి వచ్చిందట. ఈటెల రాజేందర్ గనుక రాజీనామా చేస్తే, తక్షణం అది ఆమోదం పొందుతుంది. అందుకే, రాజీనామా చేయకుండా రెబల్ ఎమ్మెల్యేగానే తెలంగాణ రాష్ట్ర సమితికి చుక్కలు చూపించాలని ఈటెలపై కార్యకర్తలు, సన్నిహితులు ఒత్తడి తెస్తున్నారట. మరోపక్క, ఈటెల ఎపిసోడ్ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిలో చిన్నపాటి ప్రకంపనలు కనిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యేలు కొందరు ఈటెల వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నారు. కొందరు కాంగ్రెస్ నేతలు కూడా ఈటెలతో చేతులు కలపబోతున్నారు. ఓ మాజీ ఎంపీ, ఈటెల గనుక పార్టీ పెడితే.. ఆర్థికంగా అండదండలు అందిస్తానని ఇటీవలే భరోసా ఇచ్చారట.