కాళేశ్వరం ప్రాజెక్టు పై జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంటుండగా, మాజీ ఆర్థికమంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ హాజరయ్యే వార్త రాజకీయ వేడి పెంచుతోంది. ముఖ్యంగా ఈటెల గతంలో బీఆర్‌ఎస్‌లో కీలకంగా ఉన్న సమయంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు నిధుల మంజూరుపై తీసుకున్న నిర్ణయాలపై కమిషన్ ప్రశ్నలు వేయనుంది. ఈ నేపథ్యంలో, ఆయన మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలకన్నా భిన్నంగా స్పందిస్తారా లేక ఆయనే కేసీఆర్‌పై బరువు వేసే నిజాలు బయట పెడతారా అన్నది ఉత్కంఠ రేపుతోంది.
ఆర్థిక నిర్ణయాల్లో పారదర్శకత ఎంత వుందన్నదే ఈ విచారణ కేంద్ర బిందువుగా మారింది. ఇప్పటికే పలువురు ఐఏఎస్‌లు, ఇంజనీర్లు, మాజీ అధికారులు కమిషన్ ఎదుట నిధుల విడుదల, టెండర్ల ప్రక్రియ, కేబినెట్ ఆమోదం లేని నిర్ణయాల గురించి కీలక విషయాలను బయటపెట్టారు. ఈ నేపథ్యంలో అప్పటి ఆర్థికమంత్రి అయిన ఈటెలకు ముఖ్యమైన ప్రశ్నలు ఎదురవుతాయి. ముఖ్యంగా ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరించిన కాలంలో మంజూరు చేసిన నిధులపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.
బీఆర్‌ఎస్‌కు చెక్ పెట్టిన తర్వాత ఈటెల ఎక్కువగా కేసీఆర్‌పై తీవ్ర విమర్శలే చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో అంతా ఆయనే నిర్ణయించారని, మంత్రివర్గాన్ని పక్కనపెట్టి ముందుకెళ్లారన్న ఆరోపణలు ఇప్పటికే చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కమిషన్ ముందు ఆయన అదే ధోరణి కొనసాగిస్తారా, లేక రాజకీయ ఒత్తిడుల నడుమ సాఫ్ట్‌గా నిలబడతారా అన్నదే మిగతా పార్టీల్లో ఉత్కంఠగా మారింది. ఆయన సమాధానాలు కేవలం రాజకీయ ఆరోపణలు కింద పరిగణిస్తే, కమిషన్ అవి ఎక్కడ వర్తిస్తాయన్న ప్రశ్న తలెత్తుతోంది.
రాజకీయంగా చూస్తే, ఈటెల ఇంకా బీఆర్‌ఎస్‌తో సంపూర్ణంగా దూరం కాలేదన్న ప్రచారం ఉంది. కొందరు కీలక నేతలు ఇప్పటికే ఈటెలను కలసి మాట్లాడినట్టు విశ్లేషకులంటున్నారు. అలా అయితే ఆయన ఆధారాలు బయటపెట్టకపోవచ్చు. కానీ కమిషన్ నివేదిక రేపు అసెంబ్లీలో పక్కా ఆధారాలతో బయటపడితే, ఈటెల మౌనం నిలబడదన్నదే స్పష్టమవుతోంది.