Vegetables: ఫ్రిడ్జ్ లో ఇవి పెడుతున్నారా..అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే !

Vegetables: పూర్వ కాలంలో ఇంటి ఆరుబయట పెరటిలో అవసరమైన కూరగాయలు, పండ్లు పువ్వులు , కొన్ని రకాల నిత్యావసర వస్తువులు పండించుకునేవారు . మందులు వాడని కూరగాయలు పండ్లు తినటం వల్ల ఆరోగ్యంగా ఉండేవారు . అయితే మారుతున్న కాలంతో పాటుగా అన్ని మారుతూ వచ్చాయి. ఇప్పుడు కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు ఏమి కావాలన్నా మార్కెట్ కి వెళ్లి కొనుక్కొని తెచ్చుకుంటున్నారు. వీటికి అనుగుణంగా వాటన్నింటినీ భద్రపరచడానికి దాదాపు ప్రతి ఒక్కరూ ఇంటిలో ఫ్రిడ్జ్ పెట్టుకొని ఉన్నారు. ఫ్రిడ్జ్ లో భద్రపరిస్తే కూరగాయలు , ఇతర పదార్థాలు ఫ్రెష్ గా ఉంటాయని భావిస్తారు.

అయితే అన్నింటిని ఫ్రిడ్జ్ లో పెట్టడం మంచిది కాదు. కొన్ని పదార్థాలను ఫ్రిడ్జ్ లో ఉంచడం వల్ల వాటి పోషకాలను కోల్పోవడమే కాక విషం లాగా కూడా తయారయ్యే అవకాశం ఉంది. అయితే వేటిని ఫ్రిడ్జ్ లో ఉంచవచ్చు, వేటిని ఉంచరాదు అనేది ఒక సారి గమనిద్దాం.

బంగాళదుంపలను ఫ్రిడ్జ్ లో పెడితే దానిలోని పిండి పదార్థం తేమను కోల్పోయి చప్పగా మారుతుంది.. వాటిని ఉడికించడానికి కూడా చాలా సమయం పడుతుంది. బంగాళాదుంపలు ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల వాటి తొక్కలోని తేమ ఆవిరి అవుతుంది.. అందువల్ల అవి గట్టిగా మరే ప్రమాదం ఉంది. బంగాళదుంపలను ఎండ తగలకుండా ఒక పేపర్ బాగ్ లో భద్రపరచడం వల్ల ఎక్కువరోజులు చెడిపోకుండా ఉంటాయి.

ఉల్లిపాయలను దాదాపుగా ఎవరు ఫ్రిడ్జ్ లో ఉంచరు. అవి మామూలుగానే చాలా ఘాటు వాసన కలిగి ఉంటాయి . వీటిని ఫ్రిడ్జ్ లో ఉంచితే చల్లదనం వల్ల ఉల్లిపొరలు దగ్గరకు చేరి కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఉల్లిపాయలు ఫ్రిడ్జ్ లో ఉంచటం వల్ల వాటి వాసన ఫ్రిడ్జ్ మొత్తం వ్యాప్తి చెంది వేరే ఏ ఇతర ఆహార పదార్థాలు కూడా అదే వాసన వస్తాయి. ఉల్లిపాయలను గది ఉష్ణోగ్రతలో వేరే ఏ ఆహారపదార్థాలకు దగ్గరగా ఉంచకుండా వాటిని మాత్రమే వేరుగా ఉంచడం మంచిది.వెల్లుల్లి, ఏలకులను ఫ్రిడ్జ్ లో ఉంచరాదు. వెల్లుల్లినీ గాలి తగిలే ప్రదేశంలో ఉంచడం మంచిది.

అరటి పళ్ళను ఫ్రిడ్జ్ లో పెట్ట కూడదు. వీటిని ఫ్రిడ్జ్ లో ఉంచడం వలన వాటి తొక్క నలుపు రంగులో మారుతుంది. వీటికి ఉన్న సహజమైన రుచిని కోల్పోవడమే కాకుండా వాటిలో ఉండే పొటాషియం తగ్గిపోతుంది. అరటిపళ్ళు ఎప్పుడు గది ఉష్ణోగ్రత లో ఉంచడం మంచిది.

తేనె, నెయ్యి, బ్రెడ్, నట్స్, రొట్టె లను కూడా ఫ్రిడ్జ్ లో ఉంచరాదు. తేనె ఫ్రిడ్జ్ లో ఉంచితే అది స్పటికాలుగా మారుతుంది. నట్స్ ఫ్రిడ్జ్ లో ఉన్న ఇతర పదార్థాల వాసనను గ్రహించి వాటి గుణం కోల్పోతాయి.

టమాటాలు కూడా ఫ్రిడ్జ్ లో పెట్టరాదు. టమోటాలో ఉండే విటమిన్ C నీ కోల్పోయి రుచి తగ్గిపోతుంది. ఇంకా టమోటా మీద ఉండే పలుచని పొర ముడతలు పడిపోతుంది. అందు వల్ల టమోటాలను గది ఉష్ణోగ్రత వద్ద ఉంచడం మంచిది. కారం పొడి, మసాలాలు, ఊరగాయలు వంటి వాటిని ఫ్రిడ్జ్ లో ఉంచడం వల్ల వాటి సహజ గుణం కోల్పోయి రుచి తగ్గిపోతుంది.