Health Tips: వేసవికాలంలో రోజురోజుకీ ఉష్ణోగ్రత తీవ్రతలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ ఉష్ణోగ్రతల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వేసవికాలంలో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి చాలామంది తరుచుగా నీటిని తాగుతూ.. చల్లటి పానీయాలను తాగుతూ ఉంటారు. వేసవి కాలంలో లభించే కొన్ని రకాల పండ్ల ద్వారా కూడా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో లభించే కర్బూజ, పుచ్చకాయ పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల అందరూ ఇది తినటానికి ఆసక్తి చూపుతారు. కానీ వేసవి కాలంలో లభించే పనసపండును ద్వారా కూడా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వేసవికాలంలో పనస పండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సాధారణంగా పనసపండు ఇష్టపడని వారంటూ ఉండరు. పనసపండులో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి. పనసపండులో ఫైబర్, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, జింక్ , విటమిన్ ఎ, సి, బి, క్యాల్షియం అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించి అనేక సీజనల్ వ్యాధులు దరిచేరకుండా కాపాడతాయి. ముఖ్యంగా వేసవి కాలంలో షుగర్ వ్యాధితో బాధ పడేవారు ఈ పండు తినటం వల్ల ఇందులో ఉండే ఫైబర్ గ్లూకోజ్ ఇన్సులిన్ శాతాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా నియంత్రిస్తుంది.
అధిక బరువు సమస్యతో బాధపడే వారు కూడా పనస పండు తినడం వల్ల అందులో ఉన్న ఫైబర్ ఆకలిని నియంత్రిస్తుంది. అంతేకాకుండా జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేసి అనేక వ్యాధులు దరి చేరకుండా కాపాడుతుంది. పనసపండులో క్యాల్షియం అధికంగా ఉండటం వల్ల శరీరంలో ఎముకలు కండరాలు దృఢంగా ఉండేందుకు ఎంతో దోహదపడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడే వారు కూడా పనస పండు తినటం వల్ల వారి సమస్య దూరం చేయవచ్చు.