Green Tea – గ్రీన్ టీ ఎక్కువగా తాగుతున్నారా? ఈ సమస్యలు తప్పవు!

Health Tips: ప్రతి ఒక్కరికి ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండాలని ఉంటుంది. అయితే శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడానికి వ్యాయామాలు చేయాలి. ఇప్పుడున్న బిజీ లైఫ్ వల్ల ఎవరి దగ్గర అంత సమయం లేదు. ఫలితంగా శరీర బరువు పెరగడం, చిన్న వయసులోనే బాన పొట్టలతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారు ప్రత్యామ్నాయంగా గ్రీన్ టీ ని ఎంచుకున్నారు. నిజానికి గ్రీన్ టీ తాగడం వల్ల శరీర బరువు తగ్గడమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గ్రీన్ టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే ఈ మధ్య కాలంలో అనేక మంది టీ, కాఫీకి ప్రత్యామ్నాయంగా గ్రీన్ టీ ని వినియోగిస్తున్నారు.

ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న గ్రీన్ టీ ని ఎవరు వద్దనుకుంటారు చెప్పండి. అయితే ఏదైనా మితంగా తీసుకుంటే ఆరోగ్యం, అమితంగా తీసుకుంటే అనారోగ్యం. రోజుకు రెండు, మూడు కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల ఎటువంటి నష్టమూ లేదు. ఆరోగ్యానికి మంచిది కదా అని మోతాదుకు మించి గ్రీన్ టీని తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం…

గ్రీన్ టీ ఎక్కువగా తీసుకోవడం ఎముకల ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఎముకలు బలహీన పడతాయి. అంతే కాకుండా బోలు ఎముకల వ్యాధి బారిన పడే అవకాశం కూడా ఉంది.

గ్రీన్ టీ ని మోతాదుకు మించి తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ పై చెడు ప్రభావం పడుతుంది. ఫలితంగా ఒంట్లోనే రక్తం స్థాయి పడిపోయి రక్త హీనత సమస్య మొదలవుతుంది.

సాధారణంగా తలనొప్పి వచ్చినప్పుడు వేడివేడిగా ఒక టీ తాగితే ఉపశమనం కలుగుతుంది. గ్రీన్ టీలో కూడా ఇటువంటి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తీవ్రమైన తలనొప్పి ఉన్నప్పుడు గ్రీన్ టీ తాగడం వల్ల ఇట్టే తగ్గిపోతుంది. అయితే మోతాదుకు మించి గ్రీన్ టీ తాగడం వల్ల తలనొప్పి అధికం అవటమే కాకుండా అది మైగ్రేన్ కు దారితీసే అవకాశం ఉంటుంది.

గ్రీన్ టీ ని మోతాదుకు మించి తీసుకోవడం జీర్ణవ్యవస్థకు ఏ మాత్రం మంచిది కాదు. గ్రీన్ టీలో ఉండే టానిన్, అసలైన్ అనే మూలకాలు ఎసిడిటి సమస్యను పుట్టిస్తాయి. ఇదే కాకుండా గ్రీన్ టీ ని మోతాదుకు మించి తాగటం వల్ల మలబద్దకం, కడుపునొప్పి, కడుపులో మంట, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధ పడాల్సి వస్తుంది.