స్టార్ డైరెక్టర్ శంకర్ ఈమధ్య ఏ ప్రాజెక్ట్ చేపట్టినా ఆటంకాలు సర్వసాధారణం అయిపోయాయి. ‘2.0’ ఫ్లాప్ కావడంతో ఆయన్ను సమస్యలు చుట్టుముట్టాయి. సగం పూర్తైన ‘ఇండియన్-2’ ఇంకా సమస్యల్లోనే కొట్టుకుంటోంది. ఇటీవల మొదలు పెట్టిన చరణ్ సినిమాకు కూడ అదే ఆటంకం అయింది. ఇక తాజాగా అయన ‘అన్నియన్’ హిందీ రీమేక్ ప్రకటించారు. దీని మీద ‘అన్నియన్’ నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ కథ నాదేనని, తన అనుమతి లేకుండా ఎలా రీమేక్ చేస్తారని శంకర్ పేరు మీద నోటీసులు పంపారు.
అయితే శంకర్ ఏమాత్రం తగ్గలేదు. సినిమా మీద సర్వహక్కులు తనవే అంటూ వివరణ ఇచ్చారు. సినిమాలో కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బై శంకర్ అనే కార్డ్ పడిందని, కథను తానే సొంతంగా రాసుకున్నానని, అందులో ఎవరి ప్రమేయమూ లేదని, కాబట్టి కథ పూర్తిగా తన సొంతమని, దాన్ని ఏం చేసుకోవడానికైనా హక్కులు తనకు ఉన్నాయని బల్లగుద్ది చెబుతున్నారు. కథ సుజాతగారి దగ్గర్నుండి కొన్నానని అంటున్నారు. సుజాతగారు కేవలం మాటలు మాత్రమే రాశారు. కథ పూర్తిగా నాదే. మీకు ఎలాంటి హక్కులు లేవు. నా మీద వస్తున్న ఈ నిరాధారమైన ఆరోపణలను ఖండిస్తున్నాను. నా ప్రాజెక్ట్ ద్వారా గుర్తింపు పొందాలని అనుకోవడం దురదృష్టకరం. మీ బుద్ది మార్చుకుంటారని ఆశిస్తున్నాను అంటూ సమాధానమిచ్చారు.