కరోనా కష్టాలు.. ఏపీ ఉద్యోగులు మెత్తబడినట్లేనా.?

2019 ఎన్నికల ప్రచారంలో ఇంతకు ముందు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఉద్యోగుల్ని ప్రసన్నం చేసుకునేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా హామీలు గుప్పించారు. అయితే, అధికారంలోకి వచ్చాకా, ఉద్యోగుల్ని పట్టించుకోలేదనే విమర్శ ఉంది.

కరోనా సమస్యలు, రాష్ర్ట ఆర్ధకి పరిస్థితులు వంటి కారణాల నేపథ్యంలో ఉద్యోగులకు బుజ్జగింపులతోనే సరిపెట్టాల్సి వస్తోంది జగన్ ప్రభుత్వం. పరిస్థితి తీవ్రతను ఉద్యోగులు కూడా అర్ధం చేసుకుంటున్నారు. అయినా కానీ, ప్రతి నెలా జీతాలు ఆలస్యమవుతుండడంతో సహా, తమ డిమాండ్లకు మోక్షం కలగకపోవడంతో ఉద్యోగుల్లో క్రమంగా అసంతృప్తి పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచాయి. ఉద్యోగుల సమస్యల్ని తీర్చలేకపోతే, ఏ ప్రభుత్వమైనా ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. రాజకీయంగా కూడా అధికారంలో ఉన్నవారికి అదొక పెద్ద తలనొప్పి.

అందుకే, పరిస్థితి చేయి దాటకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఉద్యోగ సంఘాలతో చర్చలకు ఉపక్రమించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. త్వరలోనే ఉద్యోగులకు తీపి కబురు అందబోతోందనీ, పరిస్థితిని అర్ధం చేసుకుని ఉద్యోగులు సంయమనం పాటించాలనీ సజ్జల కోరుతున్నారు.

కాగా, ఈ నెలాఖరులోగా ఉద్యోగులకు సంబంధించిన కొన్ని డిమాండ్లు పరిష్కారమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందట. ప్రతినెలా ఇకపై జీతాల ఆలస్యం అనే మాట ఉండదట. మరి, ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వ పెద్దల బుజ్జగింపులకు మెత్తబడినట్లేనా.? వేచి చూడాల్సిందే.