ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కొత్త మ్యుటేషన్ అత్యంత ప్రమాదకర రీతిలో వ్యాప్తి చెందుతోందంటూ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై కేసు నమోదైంది. చంద్రబాబు వ్యాఖ్యలతో, రాష్ట్ర ప్రజల్లో భయాందోళనలు కలుగుతున్నాయనీ, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం ద్వారా చంద్రబాబు తన స్థాయిని దిగజార్చుకున్నారనీ ఆరోపిస్తూ, ఓ న్యాయవాది కర్నూలు జిల్లాలో పోలీసులను ఆశ్రయించారు. న్యాయవాది ఫిర్యాదుతో చంద్రబాబుపై కేసు నమోదు చేశారు పోలీసులు. జాతీయ విపత్తుల చట్టం సహా పలు సెక్షన్ల కింద చంద్రబాబు మీద కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. కాగా, కొత్త మ్యుటేషన్ విషయమై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే స్పష్టత ఇచ్చింది.
అది పాత మ్యుటేషన్ అనీ, మార్చి తర్వాత దాని ఉనికి లేదనీ, నిన్ననే వైద్య ఆరోగ్య శాఖ అత్యంత స్పష్టంగా వివరణ ఇచ్చిన విషయం విదితమే. అయినాగానీ, దేశవ్యాప్తంగా ‘ఏపీ వైరస్’ పేరుతో పెను దుమారం చెలరేగుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణీకులకు తప్పనిసరి క్వారంటైన్.. అంటూ ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. తప్పుడు ప్రచారం కారణంగా జాతీయ స్థాయిలో రాష్ట్రం పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లిందనే వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇదిలా వుంటే, మీడియాలో ఇప్పటికే ఈ విషయమై చాలా కథనాలొచ్చాయి. అలా మీడియాలో వచ్చే కథనాలపైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి వుందన్న వాదనలు తెరపైకొస్తున్నాయి.