తెలంగాణ రాష్ర్టంలో, అందులోనూ జీహెచ్ ఎంసీ ఫరిదిలో కరోనా వైరస్ కేసులు అంతకంతకు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ సడలింపు నేపథ్యంలో కరోనా రాజధానిలో ఉగ్రరూపం దాల్చుతోంది. రోజు కేసులు 800కి పైనే నమోదవుతున్నాయి. మా రాష్ర్టంలో కేసులు లేవు అని..పరీక్షలు చేస్తున్నామని తప్పుడు మాటలు చెప్పిన సర్కార్ పై కరోనా విశ్వరూపం చూపిస్తోంది. తొలి నుంచి కరోనా పరీక్షలు, వైరస్ కట్టడి విషయంలో నిర్లక్ష్యం వహించిన సర్కార్ కి తాజాగా మరో గట్టి దెబ్బ తగిలింది. అదీ ప్రభుత్వంలోనే కావడం విశేషం. అన్ని పరీక్షలు రద్దు చేసి దూరం పాటించాలని నీతులు చెప్పిన కేసీఆర్ సర్కార్ ఇప్పుడు తమకే అంటుకుంటుందన్న విషయాన్ని గ్రహించలేకపోయిందని తాజా ఉద్దంతాన్ని బట్టి తెలుస్తోంది.
తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 124 మంది పోలీసులకు కరోనా సోకింది. ఇందులో హోగార్డ్ స్థాయి నుంచి డీఐజీ స్థాయి వరకూ అభ్యర్ధులు శిక్షణ పొందుతున్నారు. ఇప్పుడు వాళ్లందరికీ కరోనా అంటుకుంది. మొత్తం 1900 మంది అభ్యర్ధులు శిక్షణ పొందుతుండగా 124 మందికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో మిగతా అభ్యర్ధులికి ప్రభుత్వం పరీక్షలు నిర్వహించే పనిలో నిమగ్నమైంది. అకాడమీకి సంబంధించి ప్రతీ ప్రదేశాన్ని ఇప్పుడు శుద్ది చేస్తున్నారు. ఆఫీస్, క్లాస్ రూమ్ లు, గ్రౌండ్, షాపులు ఇలా అన్నింటికి స్ర్పే చేస్తున్నారు. మరి ఈ తప్పిదానికి అసలు కారకులు ఎవరు? అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ అనే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
సీఎం ఆదేశాల మేరకే తప్పని పరిస్థితుల్లో శిక్షణ ఇవ్వాల్సి వచ్చిందని ప్రభుత్వ అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అన్ని ఆఫీస్ లకు, స్కూళ్లకు, ఇతర సిబ్బంది కి సంబంధించి ఆఫీసులకు సెలవులు ప్రకటించారు. కానీ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలకు, అకాడమీలకు సెలవులు ఇవ్వకపోవడంపై మండిపడుతున్నారు. పోలీసోళ్లను మాత్రం తమ రక్షణ కోసం ఇలా వాడుకుంటూ ప్రాణాల మీదకు తెస్తున్నారని ఆశాఖ కు చెందిన కొందరు మండిపడుతున్నారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమే అంటూ చెప్పుకొస్తున్నారు.