Convoy Problems : ఏపీ సర్కారుకి కాన్వాయ్ కష్టాలు.!

Convoy Problems

Convoy Problems : ముఖ్యమంత్రి, మంత్రులు సహా, వీఐపీలకు సంబంధించిన కాన్వాయ్, ఇతర వాహనాల విషయమై గడచిన మూడేళ్ళలో దాదాపు 17 కోట్ల రూపాయల బకాయిలు వున్నాయట. ఈ విషయాన్ని రాష్ట్ర రవాణా శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసిందట.

ప్రభుత్వం వెంటనే, బకాయిల్ని చెల్లించాలనీ, లేనిపక్షంలో కాన్వాయ్ కోసం వాహనాలు సమకూర్చడం కష్టంగా మారిందని రవాణా శాఖ, ప్రభుత్వానికి మొరపెట్టుకుందట. అదేంటీ, సంక్షేమ పథకాల కోసం ‘బటన్ నొక్కి’ మరీ, నిధుల్ని సకాలంలో విడుదల చేస్తున్న జగన్ సర్కారు, ‘కాన్వాయ్ వాహనాల బకాయిల్ని’ చెల్లించకపోవడమా.?

వినడానికి నమ్మశక్యంగా లేని వ్యవహారమిది. కేవలం టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న దుష్ప్రచారమేనా.? లేదంటే, ఈ బకాయిల వ్యవహారంలో వాస్తవం వుందా.? అన్నదానిపై ప్రభుత్వమే అధికారికంగా వివరణ ఇవ్వాల్సి వుంది.

మొన్నీమధ్యనే ఒంగోలులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాన్వాయ్ కోసం ఆర్టీయే అధికారులు బలవంతంగా ఓ ప్రైవేటు వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం వివాదాస్పదమయ్యింది. ఆ వాహనంలో తిరుపతికి భక్తులు వెళుతుండగా, మార్గ మధ్యంలో వారిని దించేసి మరీ, వాహనాన్ని అధికారులు ఎత్తుకెళ్ళారు.

దాంతో, ముఖ్యమంత్రి ఆ తర్వాత ఎక్కడ పర్యటనల కోసం వెళుతున్నా, ‘ముఖ్యమంత్రి వస్తున్నారట.. కాన్వాయ్ కోసం మీ వాహనాలు లాక్కుంటారు జాగ్రత్త..’ అంటూ విపక్షాల నుంచి, ప్రత్యేకంగా జనసేన నుంచి పోస్టర్లు వెలుస్తున్నాయి. ఈ దుస్థితి అసలెందుకు వచ్చిందో వైసీపీ సర్కారు ఆత్మవిమర్శ చేసుకోవాలి.