కేటీఆర్ vs నారా లోకేష్.. సరికొత్త పోలిక 

chandrababu naidu
chandrababu naidu
ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు కావడంతో ప్రతి విషయంలోనూ రెండిటి మధ్యన పోలిక ఉంటోంది.  పాలనలో, అభివృద్దిలో, ముఖ్యమంత్రుల తీరులో ఇలా చాలానే కంపారిజన్స్ ఉంటాయి.  వాటిలో యువ నాయకులైన కేటీఆర్, నారా లోకేష్ నడుమ కూడా పోలిక, పోటీ చూశారు జనం.  రాష్ట్రం విడిపోయాక ఏపీకి చంద్రబాబు, తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రులు అయ్యారు.  కేసీఆర్ సీఎం అయిన వెంటనే తన కుమారుడు కేటీఆర్ ను, చంద్రబాబు తాను సీఎం అయిన వెంటనే తన కుమారుడు లోకేష్ నారాను పూర్తిగా రాజకీయ క్షేత్రంలోకి దింపారు.  అలా దింపడంలో ఇద్దరి ఉద్దేశ్యం ఒక్కటే.  తమ తర్వాత నాయకత్వ భాద్యతలను కుమారులకు అప్పగించాలని.  అంటే తాము రిటైర్ అయ్యాక తమ కుమారులు ముఖ్యమంత్రులుగా ఉండాలనేది వారి కోరిక. 
 
దీంతో నిత్యం ఇరువురు వారసుల మధ్యన పోటీ నడిచేది.  ఈ పోటీలో కేటీఆర్ లోకేష్ కంటే చాలా ముందున్నారు.  ఎంట్రీ ఇవ్వడమే ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఇచ్చి అనేక భారీ మెజారిటీతో గెలిచి తండ్రి కేబినెట్లో స్థానం దక్కించుకున్నారు కేటీఆర్.  కానీ లోకేష్ బాబును మాత్రం ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశారు చంద్రబాబు.  ఇక మంత్రులుగా కేటీఅర్ చూపిన దూకుడు లోకేష్ చూపలేకపోయారు.  కేటీఆర్ స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటూ ఎదిగితే లోకేష్ మాత్రం తండ్రి చాటు బిడ్డగా ముఖ్యమంత్రి వెనక మంత్రిగా మిగిలిపోయారు.  ప్రతిదానికీ చంద్రబాబే ముందుండాలి.  కొత్త బాధ్యతలు అప్పజెప్పాలంటే సంకోచం. 
 
కానీ కేటీఆర్ అలా కాదు.  చూసి రమ్మంటే కాల్చుకొచ్చే రకం.  కేసీఆర్ ఆశించిన దాని కంటే వేగంగానే దూసుకుపోయారు.  కేసీఆర్ సైతం బల్దియా ఎన్నికలు, పార్టీలోని నేతల మధ్య సంధి రాజకీయాలు, ప్రచార బాధ్యతలు, పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ లాంటి అనేక బరువులను కొడుకు మీద పెట్టారు.  కేటీఆర్ సైతం ఇచ్చిన ప్రతి పనిని సమర్థవంతంగా నిర్వహించి భవిష్యత్తులో తానే సీఎం అనే నమ్మకాన్ని తెచ్చుకున్నారు.  తాజాగా కేసీఆర్ లేకుండానే కేటీఆర్ క్యాబినెట్ నిర్వహించారని, త్వరలోనే ఆయన సీఎం అవుతారని ప్రచారం కూడా జరుగుతోంది.  దీంతో ఎప్పటిలాగే లోకేష్ సంగతేమిటనే ప్రస్తావన వచ్చింది. 
 
అందులో లోకేష్ గ్రాఫ్ చూస్తే గత ఎన్నికల్లో మంగళగిరి నుండి ఓటమిపాలయ్యారు.  ప్రతిపక్షంగా యేడాది గడుస్తున్నా ఇప్పటికీ అధికార పక్షం మీద దూకుడుగా వ్యవహరించి ఏ అంశంలోనూ నెగ్గింది లేదు.  ప్రజెంట్ వేడి మీదున్న అమరావతి వివాదంలో కూడా అయన పాత్ర శూన్యం.  ఇంకా ఆయన ప్రజల్లో నాయకుడిగా పూర్తి స్థాయి నమ్మకాన్ని సంపాదించుకోలేదు.  లోకేష్ నత్త నడక ప్రయాణం చూస్తే కేటీఆర్ స్థాయికి ఎదగాలంటే ఇంకెన్ని ఏళ్లు పడుతుందో అనిపిస్తోంది.