ఏపీ సీఎం వైఎస్ జగన్ గురువారం పౌరసరఫరాలశాఖ కొత్త వాహనాలను ప్రారంభించారు. ఈ రోజు ఉదయం కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన 2,500 రేషన్ డోర్ డెలివరీ వాహనాలను విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. మిగిలిన జిల్లాలకు కేటాయించిన వాహనాలను మంత్రులు ప్రారంభిస్తారు.
నేడు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,260 వాహానాలు ప్రారంభంకానున్నాయి. ఫిబ్రవరి 1వతేదీ నుంచి నాణ్యమైన రేషన్ బియ్యం డోర్ డెలివరీ కోసం ఈ వాహనాలు సిద్ధమయ్యాయి. లబ్ధిదారులకు నాణ్యమైన, మెరుగుపరచిన బియ్యాన్ని ఇంటివద్దే అందచేసేందుకు ఏటా రూ.830 కోట్లు అదనంగా వెచ్చిస్తూ పథకాన్ని రూపొందించారు.
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డుదారులకు పంపిణీ చేస్తున్న బియ్యం రంగు మారి ఉండటం, నూకల శాతం ఎక్కువగా ఉండటంతో ఎక్కువ మంది వినియోగించడం లేదు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు తినేందుకు వీలుగా నాణ్యమైన బియ్యాన్ని ఇంటివద్దే అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిల్లింగ్ సమయంలోనే నూకలు శాతాన్ని బాగా తగ్గించి కార్డుదారులకు నాణ్యతతో కూడినవి అందించేలా చర్యలు చేపట్టింది.