జనసేన పార్టీ గురించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంత తక్కువ మాట్లాడితే, వైసీపీకి అంత మంచిది. ఎందుకంటే, జనసేన పార్టీ అసలు వైసీపీకి రాజకీయ ప్రత్యర్థి కానే కాదు. నిజానికి, టీడీపీ కూడా వైసీపీకి పోటీ కాదు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఆ విషయం స్వయంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నారు.
‘ఈసారి 175 సీట్లలోనూ గెలిచేస్తాం..’ అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నప్పుడు, 2019 ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు గెల్చుకున్న జనసేన పార్టీ మీద అంత భయం ప్రదర్శించడం దేనికి.? పదే పదే.. ఆ మాటకొస్తే, ప్రతి బహిరంగ సభలోనూ, ప్రతి అధికార కార్యక్రమంలోనూ జనసేన పార్టీ ప్రస్తావన తీసుకురావడమో.. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని దత్త పుత్రుడనడమో.. తప్పనిసరైపోతోంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.
తాజాగా, జనసేన పార్టీని రౌడీ సేన.. అని అభివర్ణించారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అదీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో. ఆ వెంటనే, జనసేన నుంచి కౌంటర్ ఎటాక్ వచ్చింది. ఆ పశ్చిమగోదావరి జిల్లా పక్కనే వున్న తూర్పుగోదావరి జిల్లాలో తన దగ్గర డ్రైవరుగా పనిచేసిన వ్యక్తిని చంపేసిన ఎమ్మెల్సీది ఏ పార్టీ.? అని జనసేన ప్రశ్నిస్తోంది.
నిజమే కదా.? వైసీపీ ఎమ్మెల్యేనే ఆ హత్య చేసింది. ఆయన అరెస్టయి, జైల్లో వున్నాడు. సరే, విధిలేని పరిస్థితుల్లో ఆ ఎమ్మెల్సీని వైసీపీ నుంచి సస్పెండ్ చేశారనుకోండి.. అది వేరే సంగతి.
‘మా నాయకుడు పవన్ కళ్యాణ్ అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్ళలేదు.. నీలా 16 నెలలు చిప్పకూడు తినలేదు.. మరి, నువ్వు రౌడీవా.? జనసేనాని రౌడీనా.?’ అని జనసేన ప్రశ్నిస్తోంది. నిజానికి, జనసేన నుంచి వచ్చే ప్రతి విమర్శా, సోషల్ మీడియాలో అనూహ్యంగా వైరల్ అయిపోతుంటుంది. ఈ విషయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలియదా.?